Chiranjeevi: డీప్‌ఫేక్‌పై ఆందోళన వ్యక్తం చేసిన చిరంజీవి

Chiranjeevi Expresses Concern Over Deepfake Technology
  • డీప్‌ఫేక్‌ టెక్నాలజీ పెద్ద గొడ్డలిపెట్టు అన్న చిరంజీవి
  • తాను కూడా డీప్‌ఫేక్‌ బాధితుడినేనని వెల్లడి
  • ఫిర్యాదు చేయగానే తెలంగాణ పోలీసులు వేగంగా స్పందించారని కితాబు
డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొడ్డలిపెట్టుగా మారుతోందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కూడా డీప్‌ఫేక్‌ బారిన పడ్డానని, కొందరు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారని ఆయన వెల్లడించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనర్‌తో కలిసి 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, డీప్‌ఫేక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

"డీప్‌ఫేక్‌ అనేది చాలా ప్రమాదకరమైనది. నా ఫొటోలను మార్ఫింగ్ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారు" అని చిరంజీవి తెలిపారు.

పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దానితో పాటు వచ్చే ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "డీప్‌ఫేక్‌, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి సారించి కఠినమైన చట్టాలు రూపొందించాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు మాట్లాడుతూ, 560 సంస్థానాలను ఏకం చేసి దేశానికి 'వన్ నేషన్' అనే గొప్ప వరాన్ని అందించిన మహనీయుడు సర్దార్ పటేల్ అని చిరంజీవి కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, దార్శనికత అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. 
Chiranjeevi
Deepfake
Cyber Crime
Telangana Police
Sajjanar
Shiva Dhar Reddy
Run for Unity
Sardar Vallabhbhai Patel
Hyderabad
Morphing

More Telugu News