Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేశ్‌కు బిగుస్తున్న ఉచ్చు

Fake Liquor Case SIT Investigates Jogi Ramesh Involvement
  • నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు చిక్కులు
  • జోగి ప్రోద్బలంతోనే వ్యాపారం చేశామన్న ప్రధాన నిందితులు
  • సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించిన అద్దేపల్లి సోదరులు
  • జోగితో ఆర్థిక లావాదేవీల ఆధారాలు సమర్పించినట్లు సమాచారం
  • మరో నిందితుడి విచారణ తర్వాత జోగిని ప్రశ్నించనున్న అధికారులు
  • ముగిసిన అద్దేపల్లి సోదరుల కస్టడీ.. జైలుకు తరలింపు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు.. సిట్ అధికారుల విచారణలో జోగి రమేశ్ పేరును వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ప్రోత్సాహం, అభయంతోనే తాము 2022 నుంచి నకిలీ మద్యం వ్యాపారాన్ని కొనసాగించామని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే జోగి రమేశ్‌ను విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న అద్దేపల్లి సోదరులను సిట్ అధికారులు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇబ్రహీంపట్నం, ములకలచెరువు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను జోగి రమేశ్ అండతోనే నడిపినట్లు వారు అంగీకరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దందా మూసివేయాలని భావించగా, "అంతా తాను చూసుకుంటానని" మాజీ మంత్రి భరోసా ఇచ్చారని నిందితులు వివరించారు.

జోగి ఇచ్చిన ధైర్యంతోనే బెంగళూరు నుంచి స్పిరిట్, ఇతర రసాయనాలను భారీగా దిగుమతి చేసుకున్నట్లు అద్దేపల్లి సోదరులు పూసగుచ్చినట్లు చెప్పారని సమాచారం. అంతేకాకుండా, జోగి రమేశ్‌తో తమకు ఉన్న సంబంధాలు, జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కూడా వారు సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. వీడియో రికార్డింగ్ మధ్య జరిగిన ఈ విచారణలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ముగిసిన కస్టడీ.. తదుపరి విచారణ
అద్దేపల్లి సోదరుల కస్టడీ గురువారంతో ముగియడంతో వారిని విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జనార్దనరావును నెల్లూరు కేంద్ర కారాగారానికి, జగన్మోహనరావును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. శుక్రవారం నుంచి మరో నిందితుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాత జోగి రమేశ్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, జోగి రమేశ్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇదే కేసులో చిత్తూరు జైల్లో ఉన్న నలుగురు నిందితులపై పీటీ వారెంట్ జారీ అయింది. వారిని నవంబర్ 12లోగా విజయవాడ కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
Jogi Ramesh
Fake Liquor Case
Andhra Pradesh Politics
YSRCP
Addepalli Janardhana Rao
Addepalli Jaganmohan Rao
SIT Investigation
Liquor Mafia
Tirumalasetti Srinivasa Rao
Vijayawada

More Telugu News