Maoists: మావోయిస్టుల ఫండింగ్ గుట్టురట్టు.. రూ.400 కోట్ల నిధులు, 400 కిలోల బంగారం?

Maoists Funding Exposed Rs 400 Crore Funds 400 kg Gold
  • ఆపరేషన్ కగార్‌తో లొంగుబాట పడుతున్న మావోయిస్టులు
  • వందల కోట్ల పార్టీ ఫండ్‌ను బంగారంగా మార్చినట్లు అనుమానం
  • మావోయిస్టుల వద్ద రూ.400 కోట్లు, 400 కిలోల బంగారం ఉన్నట్లు అంచనా
  • డొల్ల కంపెనీలు, బినామీ ఖాతాలతో నిధుల మళ్లింపు గుట్టురట్టు
  • లొంగిపోయిన మావోల ద్వారా డబ్బు ఆచూకీపై నిఘా వర్గాల ఆరా
  • ప్రాణభయంతోనే లొంగుబాటు.. ఆర్థిక ఇబ్బందులతో కాదంటున్న పోలీసులు
భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాట పడుతుండటంతో.. వారి భారీ ఆర్థిక సామ్రాజ్యం గుట్టు మెల్లగా వీడుతోంది. మావోయిస్టులు వివిధ మార్గాల్లో వసూలు చేసిన వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చేశారని, భారీగా బంగారు నిల్వలు దాచిపెట్టారని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి సేకరించిన నిధులను మావోయిస్టులు రెండు మార్గాల్లో మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతిపరులు, వారి కుటుంబసభ్యుల పేర్లతో డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలను అందులోకి మళ్లిస్తున్నారు. మిగిలిన భారీ మొత్తాన్ని, ముఖ్యంగా కొవిడ్ సమయంలో, బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల వద్ద సుమారు రూ.400 కోట్ల నిధులు, 400 కిలోల బంగారం నిల్వలు ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఝార్ఖండ్‌కు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ) నేత దినేశ్‌ గోపే, తన భార్య బంధువుల పేరిట డొల్ల కంపెనీలు సృష్టించి రూ.20 కోట్లకు పైగా మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. అలాగే, గతంలో ఓ మావోయిస్టు నేత తన బంధువు వైద్య కళాశాల ఫీజు కోసం ఏకంగా రూ.1.13 కోట్లను బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

అయితే, మావోయిస్టులు లొంగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారి వద్ద ఉన్న నిధులతో మరో ఐదారేళ్లు పార్టీని నడపగలరని, కానీ భద్రతా బలగాల ఆపరేషన్లతో ప్రాణభయం పెరిగిపోవడంతోనే లొంగుబాటు బాట పడుతున్నారని విశ్లేషిస్తున్నాయి. లొంగిపోయే ముందు తమ వద్ద ఉన్న డబ్బు, ఆయుధాల లెక్కలను పార్టీకి అప్పగించి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు విచారిస్తూ.. దాచిపెట్టిన డబ్బు, బంగారం డంపుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
Maoists
Maoist Funding
Naxalites
Operation Kagar
NIA Investigation
Jharkhand
Chhattisgarh
Telangana
AP
Maoist Gold Reserves

More Telugu News