Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్‌పై కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు.. రూ.41,921 కోట్ల నిధులు మళ్లింపు!

Cobrapost Alleges Massive Financial Scam in Anil Ambanis Reliance Group
  • రూ.41,921 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారన్న కోబ్రాపోస్ట్
  • లిస్టెడ్ కంపెనీల నుంచి ప్రమోటర్ల సంస్థలకు నిధుల బదిలీ
  • విదేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా అక్రమంగా నిధుల తరలింపు
  • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అనిల్ అంబానీ గ్రూప్
  • షేర్ల ధరలు పడగొట్టేందుకే ఈ దుష్ప్రచారం అని వెల్లడి
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ (అడాగ్)లో భారీ ఆర్థిక కుంభకోణం జరిగిందంటూ ఇన్వెస్టిగేటివ్ పోర్టల్ 'కోబ్రాపోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది. 2006 నుంచి గ్రూప్ కంపెనీలు ఏకంగా రూ.41,921 కోట్లకు పైగా నిధులను పక్కదారి పట్టించాయని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను రిలయన్స్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమ కంపెనీల షేర్ల ధరలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేసింది.

కోబ్రాపోస్ట్ కథనం ప్రకారం రిలయన్స్ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలైన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వంటి సంస్థలు.. బ్యాంకు రుణాలు, ఐపీఓలు, బాండ్ల ద్వారా సేకరించిన నిధుల్లోంచి రూ.28,874 కోట్లను ప్రమోటర్లకు సంబంధించిన ఇతర కంపెనీలకు మళ్లించారని ఆరోపించింది. ఇది మాత్రమే కాకుండా, మరో రూ.13,047 కోట్లను సింగపూర్, మారిషస్, సైప్రస్, యూకే, అమెరికా వంటి దేశాల నుంచి డొల్ల కంపెనీల ద్వారా అక్రమంగా దేశంలోకి తరలించారని పేర్కొంది.

ఈ నిధుల మళ్లింపు కోసం అనిల్ అంబానీ గ్రూప్ ప్రత్యేకంగా కొన్ని కంపెనీలను (ఎస్పీవీ) ఏర్పాటు చేసిందని కోబ్రాపోస్ట్ తెలిపింది. తొలుత నిధులను ఈ కంపెనీలకు బదిలీ చేసి, ఆ తర్వాత వాటిని రద్దు చేయడం వంటి చర్యల వల్ల గ్రూప్‌లోని ఆరు లిస్టెడ్ కంపెనీలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయని వివరించింది. వ్యక్తిగత విలాసాలకు కూడా ఈ నిధులను వాడారని, 2008లో అనిల్ అంబానీ 2 కోట్ల డాలర్ల విలువైన ఒక విలాసవంతమైన పడవ (యాచ్)ను కంపెనీ నిధులతో కొనుగోలు చేశారని ఉదహరించింది.

ఈ మొత్తం వ్యవహారంలో కంపెనీల చట్టం, ఫెమా, పీఎంఎల్‌ఏ, సెబీ, ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెబీ, ఎన్‌సీఎల్‌టీ, ఆర్‌బీఐ వంటి సంస్థల ఫైలింగ్స్, ఉత్తర్వుల ఆధారంగానే తాము ఈ వివరాలు సేకరించినట్టు కోబ్రాపోస్ట్ స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠ‌ను దెబ్బతీయాలనే కుట్రలో భాగమే ఈ కథనమని అనిల్ అంబానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Anil Ambani
Reliance Group
Cobrapost
Financial Irregularities
Fund Diversion
Reliance Capital
Reliance Communications
Economic Offenses
Corporate Misgovernance
Shell Companies

More Telugu News