Kash Patel: ప్రేయసి కాన్సర్ట్‌కు ప్రభుత్వ విమానంలో వెళ్లిన కాశ్ పటేల్.. విమర్శల వెల్లువ

Kash Patel Flew in Government Plane to Girlfriend Concert Sparks Criticism
  • టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో ప్రియురాలి కాన్సర్ట్
  • కార్యక్రమానికి హాజరైన కాశ్ పటేల్
  • ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించినట్లు మాజీ అధికారి ఆరోపణ
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ఐబీ) డైరెక్టర్, భారత సంతతి నేత కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తన ప్రియురాలి కాన్సర్ట్‌ను చూసేందుకు 60 మిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ విమానంలో వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల అమెరికా షట్‌డౌన్‌తో కొంతమంది ఉద్యోగులకు వేతనాలు కూడా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాశ్ పటేల్ తన వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం వివాదాస్పదమైంది.

టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో గత వారాంతంలో ఒక రెజ్లింగ్ ఈవెంట్‌లో కాశ్ పటేల్ ప్రియురాలు అలెక్సిస్ విల్‌కిన్స్ కాన్సర్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కాశ్ పటేల్ హాజరయ్యారు. కాన్సర్ట్‌లో అలెక్సిస్‌తో దిగిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

కాశ్ పటేల్ దీని కోసం ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించినట్లు ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఆరోపించారు. అటు ఫ్లైట్ డేటా రికార్డుల్లోనూ ఆ విమానం టెన్నెస్సీ వెళ్లినట్లుగానే ఉంది.

ఎఫ్‌బీఐ నేషనల్ హెడ్ క్వార్టర్స్ పేరుతో రిజిస్టర్ అయిన ఆ విమానం అక్టోబర్ 25న వర్జీనియా నుంచి బయలుదేరి పెన్సిల్వేనియాలోని స్టేట్ కాలేజీ రీజినల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత ఇదే విమానం టెన్నెస్సీలోని నాష్‌విల్లేకు వెళ్లినట్లు ఫ్లైట్ డేటాలో రికార్డు అయింది. అయితే ప్రయాణికుల జాబితా బయటకు రాలేదు. కాశ్ పటేల్ అందులో ప్రయాణించారా లేదా అనే అంశంపై స్పష్టత లేనప్పటికీ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఆయన గతంలో పలుమార్లు ప్రభుత్వ విమానం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Kash Patel
Alexis Wilkins
FBI
Government Plane
Controversy
Nashville
Tennessee

More Telugu News