Azharuddin: అజారుద్దీన్‌కు కేబినెట్లో చోటు కల్పించవద్దనే కుట్రలు కనిపిస్తున్నాయి: భట్టివిక్రమార్క

Bhatti Vikramarka Comments on Conspiracy Against Azharuddin Cabinet Position
  • అజారుద్దీన్ మన దేశ, రాష్ట్ర కీర్తిపతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అన్న భట్టివిక్రమార్క
  • అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని లేఖలు రాయడమేమిటని ఆగ్రహం
  • ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సహకరించేందుకే బీజేపీ లేఖ రాసిందని ఆరోపణ
హైదరాబాద్ బిడ్డ, క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వవద్దంటూ బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించారని ఆయన కొనియాడారు.

దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుడిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని లేఖలు రాయడం దారుణమని భట్టివిక్రమార్క అన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే అందరూ స్వాగతించాలని, కానీ ఆయనను వద్దంటూ లేఖలు రాయడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలుపు కోసమే బీజేపీ నేతలు ఈ లేఖ రాశారని ఆయన ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని అన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవలేదని తెలిసే బలహీన వ్యక్తిని నిలబెట్టిందని, అదే సమయంలో అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.

ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. మైనారిటీలకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే అడ్డుకునేలా బీజేపీ విషం చిమ్ముతోందని ఆయన మండిపడ్డారు. గొప్ప క్రీడాకారుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అడ్డుకునే ప్రయత్నాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల వేళ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
Azharuddin
Mallu Bhatti Vikramarka
Telangana
Jubilee Hills by election
BJP
BRS
Minister post

More Telugu News