Google: ఏఐతో అదరగొట్టిన గూగుల్.. ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డ్!

Sundar Pichai Announces Googles First 100 Billion Dollar Quarterly Revenue
  • చరిత్రలో తొలిసారి 100 బిలియన్ డాలర్ల త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన ఆల్ఫాబెట్
  • సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్ విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదు
  • జెమినీ యాప్‌కు 650 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు
  • ఏఐ ఆధారిత సేవలతో గణనీయంగా పెరిగిన గూగుల్ సెర్చ్ ప్రశ్నలు
  • క్లౌడ్ బ్యాక్‌లాగ్ 155 బిలియన్ డాలర్లకు చేరినట్టు వెల్లడించిన పిచాయ్
  • 300 మిలియన్లు దాటిన‌ గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు
టెక్ దిగ్గజం, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. తన చరిత్రలో తొలిసారిగా ఒకే త్రైమాసికంలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.80 లక్షల కోట్లు) ఆదాయాన్ని సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. సెర్చ్, క్లౌడ్, యూట్యూబ్ సహా అన్ని కీలక విభాగాల్లోనూ బలమైన రెండంకెల వృద్ధిని సాధించడం వల్లే ఇది సాధ్యమైందని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు.

కంపెనీ 2025 మూడో త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సుందర్ పిచాయ్ ఈ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "జెమినీ యాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 650 మిలియన్లు దాటింది. గత త్రైమాసికంతో పోలిస్తే జెమినీపై వచ్చే ప్రశ్నలు మూడు రెట్లు పెరిగాయి" అని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

క్లౌడ్ విభాగం అద్భుతమైన పనితీరు కనబరిచిందని, ఏఐ ఆధారిత ఆదాయం దీనికి ముఖ్య కారణమని పిచాయ్ అన్నారు. "క్లౌడ్ బ్యాక్‌లాగ్ గత క్వార్టర్‌తో పోలిస్తే 46 శాతం పెరిగి 155 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య 300 మిలియన్ల మార్కును దాటింది" అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో ప్రారంభించిన 'ఏఐ మోడ్'కు రోజూ 75 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని, ఇది సెర్చ్ ప్రశ్నల పెరుగుదలకు దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు.

గూగుల్ సర్వీసెస్ ఆదాయం ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 87 బిలియన్ డాలర్లకు చేరిందని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ తెలిపారు. సెర్చ్, యూట్యూబ్ విభాగాల్లో నమోదైన వృద్ధి దీనికి కారణమని చెప్పారు. గూగుల్ సెర్చ్ ఆదాయం 15 శాతం పెరగ్గా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు ప్రధాన పాత్ర పోషించాయని వివరించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయం కూడా 15 శాతం పెరిగింది. ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ వంటి కొత్త ఫీచర్లపై పెడుతున్న పెట్టుబడులు వాణిజ్యపరమైన ప్రశ్నలను పెంచి, ఆదాయాన్ని ఆర్జించడానికి మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.
Google
Sundar Pichai
Alphabet
Q3 2025
Artificial Intelligence
AI
YouTube
Google Cloud
Google Gemini
Tech News

More Telugu News