New Cyber Fraud: 'ఆర్‌టీవో చలాన్' పేరుతో కొత్త మోసం.. ఆ వాట్సాప్ మెసేజ్‌తో జాగ్రత్త!

RTO Challan New Cyber Fraud Alert in AP
  • ఏపీలో 'ఆర్‌టీవో చలాన్' పేరుతో కొత్త తరహా సైబర్ మోసం
  • వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్ పంపిస్తున్న కేటుగాళ్లు
  • చలానా చెక్ చేసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ అంటూ బెదిరింపులు
  • ఫైల్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ హ్యాంగ్.. వేగంగా బ్యాటరీ డౌన్
  • బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు సైతం మాయమయ్యే ప్రమాదం
ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 'ఆర్‌టీవో చలాన్' పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడుతున్నారు. ఈ మెసేజ్‌తో పాటు పంపుతున్న ఓ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అవ్వడంతో పాటు బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోసం చేసే విధానం ఇదే..
వాహనదారులకు "మీ వాహనంపై ఈ-చలాన్ నమోదైంది. వెంటనే చెక్ చేసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలవుతుంది" అంటూ 'ఫ్రమ్, ఆర్‌టీవో ఆఫీస్' పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో పాటు 'ఆర్‌టీవో చలాన్ ఏపీకే' అనే ఫైల్‌ను కూడా పంపుతున్నారు. చలానా వివరాలు తెలుసుకోవాలనే ఆత్రుతతో చాలామంది ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

అలా ఇన్‌స్టాల్ చేయగానే, ఆ అప్లికేషన్ ఫోన్‌లోని కాంటాక్టులు, మెసేజ్‌లు వంటి వాటికి పర్మిషన్లు అడుగుతుంది. యూజర్లు అనుమతి ఇవ్వగానే, వారి ఫోన్‌లో 'వాలంటీర్స్ గ్రూప్' అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ దానంతట అదే క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా ఆ ఫోన్ నుంచి కాంటాక్టు లిస్ట్‌లో ఉన్న ఇతరులకు ఈ మాల్వేర్ ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతుంది.

ఫోన్‌కు ఎదురయ్యే సమస్యలు
ఈ ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ఫోన్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ఫోన్లలో వాట్సాప్ హ్యాంగ్ అయి పనిచేయడం లేదు. మరికొందరిలో ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా అయిపోతోంది. ఫుల్ ఛార్జింగ్ పెట్టినా అరగంటలోనే బ్యాటరీ 20 శాతానికి పడిపోతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి మాల్వేర్‌ను తొలగించుకోవాలని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఫోన్‌లోని డేటా మొత్తం పోయే అవకాశం ఉంది. అందువల్ల, 'ఆర్‌టీవో చలాన్' పేరుతో వచ్చే ఎలాంటి అనుమానాస్పద మెసేజ్‌లను, ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని వారు హెచ్చరిస్తున్నారు.
New Cyber Fraud
RTO Challan
Visakhapatnam
cyber crime
fraud
APK file
WhatsApp
e-challan
Andhra Pradesh
malware
phone hacking

More Telugu News