CP Brown: రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి .. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ

CP Brown Jayanti to be Celebrated as State Festival in AP
  • ప్రతి ఏటా నవంబర్ 10న అధికారికంగా వేడుకలు
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ
  • తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యానికి విశేషమైన సేవలు అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. "ఆయన తన ఖాళీ సమయాన్ని, సంపాదనలో ప్రతి రూపాయిని తెలుగు భాష, సాహిత్య పునరుజ్జీవనం కోసమే వెచ్చించారు. తెలుగు అధ్యయనాలకు కృషి చేసిన యూరోపియన్ పండితుల్లో సీపీ బ్రౌన్ పేరు ఒక దీపంలా వెలుగుతుంది" అని ప్రభుత్వం కొనియాడింది.

లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా పనిచేసిన ఆయన, తన చివరి శ్వాస వరకు తెలుగు భాషకే అంకితమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడిగా సీపీ బ్రౌన్‌ను ప్రభుత్వం గౌరవించింది. ఈ నిర్ణయంతో తెలుగు భాషకు ఆయన అందించిన సేవలకు సముచిత గౌరవం లభించినట్లయింది. 
CP Brown
Charles Philip Brown
AP Government
Telugu Language
Telugu Literature
State Festival
Ajay Jain
Andhra Pradesh
Telugu Studies

More Telugu News