Vedam Subrahmanyam: ఇదొక ఆసక్తికరమైన కేసు... చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా జైలులోనే!

Vedam Subrahmanyam Wrongfully Imprisoned for Over Four Decades
భారత సంతతి వ్యక్తికి అమెరికాలో వింత పరిస్థితి
స్నేహితుడి హత్య కేసులో 40 ఏళ్లు జైలు శిక్ష
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నిర్దోషిగా విడుదల
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం స్నేహితుడి హత్య కేసులో అరెస్టై, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపారు. చివరకు తాను నిర్దోషినని నిరూపించుకుని విడుదలవుతున్న సమయంలో, మరో పాత కేసులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహించని పరిణామంతో ఆయన కుటుంబం మరో న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

వివరాల్లోకి వెళితే.. వేదం సుబ్రహ్మణ్యం (64) తొమ్మిది నెలల వయసులోనే 1962లో తన తల్లిదండ్రులతో కలిసి చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలో స్థిరపడి, అమెరికా పౌరసత్వం కూడా పొందారు. 1980లో ఆయన స్నేహితుడు థామస్ కిన్సర్ అదృశ్యమై, తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు. చివరిసారిగా సుబ్రహ్మణ్యంతోనే ఉన్నాడన్న కారణంతో పోలీసులు 1982లో ఆయన్ను అరెస్టు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోకపోయినా.. 1983లో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అప్పటికి ఆయన వయసు కేవలం 22 ఏళ్లు.

గత నాలుగు దశాబ్దాలుగా జైలు గోడల మధ్యే ఉన్న సుబ్రహ్మణ్యం, తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. జైల్లో ఉంటూనే పలు డిగ్రీలు పూర్తి చేసి, తోటి ఖైదీలకు విద్యాదానం చేశారు. ఈ క్రమంలో, అక్రమంగా శిక్ష అనుభవిస్తున్న వారికి న్యాయసహాయం అందించే ఓ స్వచ్ఛంద సంస్థ 2022లో ఆయన కేసును టేకప్ చేసింది. వారి పోరాట ఫలితంగా, సరైన ఆధారాలు లేవని నిర్ధారించిన పెన్సిల్వేనియా కోర్టు ఇటీవల సుబ్రహ్మణ్యాన్ని నిర్దోషిగా ప్రకటించింది.

అయితే, 40 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలవుతున్న ఆనందం ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంతోసేపు నిలవలేదు. జైలు గేటు వద్దే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో అరెస్ట్ కావడానికి ముందు సుబ్రహ్మణ్యంపై నమోదైన ఓ మాదకద్రవ్యాల కేసులో దోషిగా తేలారు. ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఆయన్ను భారత్‌కు తిప్పి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హత్య కేసులో జైల్లో ఉండటంతో అప్పట్లో బహిష్కరణ చర్యలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ కేసు నుంచి విముక్తి లభించడంతో, ఇమ్మిగ్రేషన్ అధికారులు పాత కేసును తిరగదోడారు.

భారత్‌లో ఆయనకు బంధువులు ఎవరూ లేరని, ఆయన జీవితమంతా అమెరికాలోనే గడిచిందని సోదరి సరస్వతి వాదిస్తున్నారు. దేశ బహిష్కరణను ఆపేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. 
Vedam Subrahmanyam
Thomas Kinser
wrongful conviction
immigration detention
ICE
India deportation
Pennsylvania court
Indian American
drug case
legal battle

More Telugu News