IIT Jodhpur: అత్యంత దృఢమైన లోహాన్ని ఆవిష్కరించిన ఐఐటీ జోథ్ పూర్ పరిశోధకులు

IIT Jodhpur Researchers Discover Super Strong Metal
  • మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఐటీ జోధ్‌పూర్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
  • విమానాల్లో వాడే లోహాల కన్నా సగం బరువుకే రూపకల్పన
  • విమాన ఇంజిన్లు, రక్షణ పరికరాల తయారీకి అత్యంత అనుకూలం
  • ఈ కొత్త లోహానికి 'TiAl-CA'గా నామకరణం
దేశీయంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఐఐటీ జోధ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అత్యంత తేలికగా ఉంటూనే, ఉక్కు కన్నా దృఢంగా ఉండే ఒక సరికొత్త 'సూపర్ మెటల్'ను విజయవంతంగా సృష్టించారు. TiAl -CA అని పేరు పెట్టిన ఈ లోహం భవిష్యత్తులో విమానయానం, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని భావిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'మెటీరియల్ హోరైజన్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఈ 'సూపర్ మెటల్' అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది 900 డిగ్రీల సెంటీగ్రేడ్ల అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కూడా 1.1 గిగా పాస్కల్ ఒత్తిడిని సునాయాసంగా తట్టుకోగలదు. ప్రస్తుతం విమానాల తయారీలో వినియోగిస్తున్న లోహాలతో పోలిస్తే దీని బరువు కేవలం సగం మాత్రమే ఉంటుందని పరిశోధకులు తెలిపారు. బరువు తక్కువగా ఉండటం వల్ల విమానాల్లో ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

సాధారణంగా ఇలాంటి మిశ్రమ లోహాలు పెళుసుగా మారడం లేదా పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటాయి. కానీ, 'TiAl-CA'కు ఆ సమస్యలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనికి అదనంగా బోరాన్ వంటి పదార్థాలను కలపాల్సిన అవసరం కూడా లేదు. నియోబియం, టంగ్‌స్టన్ వంటి ప్రత్యేక మూలకాలతో తయారైన ఈ లోహాన్ని సులభంగా కావలసిన ఆకృతిలోకి మార్చుకోవచ్చు. అలాగే, ఇది 3డీ ప్రింటింగ్‌కు కూడా అనువుగా ఉండటం మరో విశేషం.
 
ఈ సూపర్ మెటల్‌ను తేలికైన, ఇంధనాన్ని ఆదా చేసే విమాన ఇంజిన్లు, అత్యాధునిక రక్షణ పరికరాల తయారీలో వినియోగించవచ్చని పరిశోధక బృందం వివరించింది. ప్రస్తుతం దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తున్నామని, త్వరలోనే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
IIT Jodhpur
Super Metal
TiAl-CA
Material Horizons
Aviation
Defense
Metal Alloy
High Temperature Alloy
3D Printing
Make in India

More Telugu News