Priyanka Chopra: మెడలో పాముతో ప్రియాంక చోప్రా... భర్త ఆసక్తికర వ్యాఖ్యలు

Priyanka Chopra Poses With Snake Nick Jonas Reacts
  • మెడలో భారీ పాముతో ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా
  • భర్త నిక్ జొనాస్‌తో కలిసి పాముతో పోజులు
  • కొత్త జ్యువెలరీ బాగుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించిన నిక్ జోనాస్
అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా తన సాహసోపేతమైన చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక భారీ పామును ఆభరణంలా మెడలో చుట్టుకుని ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు, ఒక వీడియోను పోస్ట్ చేశారు. తెల్లటి టాప్, డెనిమ్ జీన్స్, స్టైలిష్ బ్యాండనాతో ఉన్న ఆమె, మెడలో ఒక పెద్ద పామును వేసుకుని ఎంతో ధైర్యంగా కెమెరాకు పోజులిచ్చారు. ఆమెతో పాటు భర్త, ప్రముఖ సింగర్ నిక్ జొనాస్ కూడా ఉన్నారు. ప్రియాంక పాముతో చాలా సౌకర్యంగా కనిపించినప్పటికీ, నిక్ జొనాస్ ముఖంలో మాత్రం కాస్త భయం, అసౌకర్యం స్పష్టంగా కనిపించాయి.

ఈ పోస్ట్‌లోని ఒక వీడియోలో నిక్ జొనాస్.. "బేబ్, నీ కొత్త జ్యువెలరీ చాలా బాగుంది" అని అనగా, ప్రియాంక తనదైన శైలిలో స్పందిస్తూ, "థ్యాంక్స్, ఇదే నా కొత్త సెర్పెంటి (పాము ఆకారంలో ఉండే ఆభరణం)" అని బదులిచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు, గతంలో తాను పాములతో దిగిన పాత ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. అందులో ఒకటి 2011లో వచ్చిన ‘7 ఖూన్ మాఫ్’ సినిమాలోనిది కాగా, మరొక ఫోటోలో నాగుపామును చేతితో పట్టుకుని కనిపించారు. తాను ‘ది జంగిల్ బుక్’ సినిమాలో ‘కా’ అనే పాము పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చిన పోస్టర్‌ను కూడా జత చేశారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, "ది జంగిల్ బుక్‌లో మీ వాయిస్ అద్భుతం" అని కామెంట్ చేయగా, మరికొందరు నిక్ ముఖంలోని భయాన్ని చూసి నవ్వుల ఎమోజీలు పోస్ట్ చేశారు. అయితే, జంతు ప్రేమికుల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. "వినోదం కోసం జంతువులను వాడటం సరికాదు. వాటికి కూడా ప్రాణం, భావాలు ఉంటాయి. వాటి అనుమతి లేకుండా మనం వాటిని వాడుకోకూడదు. ఈ భూమిని పంచుకుంటున్న తోటి జీవులను గౌరవించడం నేర్చుకోవాలి" అంటూ ఒక యూజర్ తీవ్రంగా స్పందించారు.
Priyanka Chopra
Nick Jonas
Priyanka Chopra snake
7 Khoon Maaf
The Jungle Book
Celebrity news
Viral photo
Social media
Animal rights
Entertainment

More Telugu News