DK Suresh: డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది.. కానీ రాసిపెట్టి ఉండాలి: డీకే సురేశ్

DK Suresh Wants DK Shivakumar as Karnataka Chief Minister
  • విధి రాత ఉంటే తన అన్న ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని వ్యాఖ్య
  • అధికార మార్పిడి గురించి తనకు సమాచారం లేదన్న డీకే సురేశ్
  • పార్టీకి మచ్చ తేకుండా కష్టపడి పనిచేస్తాడని కితాబు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డీకే సురేశ్ అన్నారు. విధి రాత ఉంటే తన అన్న ఆ పదవిని అధిరోహిస్తారని వ్యాఖ్యానించారు. అయితే, త్వరలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందనే ఊహాగానాలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ నెలలో కర్ణాటకలో అధికార మార్పిడి, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గురించి మీడియా ప్రశ్నించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార మార్పిడి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నవంబర్ అంటే కన్నడ రాజ్యోత్సవం, కన్నడిగుల పండుగ జరుపుకోవడం గురించి తనకు తెలుసన్నారు. నవంబర్ విప్లవం గురించి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఏఐసీసీ నాయకులను అడగాలని ఆయన అన్నారు.

తన సోదరుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని రాసిపెట్టి ఉంటే అవుతారని, లేదంటే లేదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, తన సోదరుడిని ముఖ్యమంత్రిగా చూడాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు అతను ఎలాంటి లాబీయింగ్ చేయడం లేదని అన్నారు.

డీకే శివకుమార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారని, కష్టపడి పని చేయాలని అన్నారు. పార్టీకి ఎలాంటి మరక అంటించకుండా ముందుకు సాగాలని సూచించారు. ఆయన చాలా బాగా పని చేస్తున్నారని, ఇదే తీరు కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
DK Suresh
DK Shivakumar
Karnataka
Chief Minister
Congress Party
Karnataka Politics
Deputy Chief Minister

More Telugu News