Sheikh Hasina: ఢిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్నాను కానీ, ఆ దాడుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను: షేక్ హసీనా

Sheikh Hasina Feels Free in Delhi But Takes Precautions
  • తన కుటుంబంపై హింసాత్మక దాడులు జరిగాయన్న షేక్ హసీనా
  • వచ్చే బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టీకరణ
  • బంగ్లాదేశ్‌లో రాజ్యాంగ బద్ధ పాలన రావాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్న హసీనా
ఢిల్లీలో తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని, అయితే కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళనల కారణంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షేక్ హసీనా అనంతరం భారత్‌కు వచ్చారు. గత సంవత్సరం ఆగస్టు 5 నుంచి ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. అప్పటి నుంచి పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆమె, బుధవారం మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు.

వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ పోటీ చేయకపోతే తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని అన్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో అధికారం చేపట్టడానికైనా లేదా ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం నెలకొనాలంటే తిరిగి తమ పార్టీ అధికారంలోకి రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

దేశ భవిష్యత్తును ఏ ఒక్క కుటుంబం లేదా ఒక వ్యక్తి నిర్వహించాలని తాను భావించడం లేదని షేక్ హసీనా అన్నారు. తాను దేశం విడిచి వచ్చిన తరువాత తమ పార్టీ నేతలపై దాడులు చేయడం, తమ పార్టీపై నిషేధం విధించడం ద్వారా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ ఓటమిని అంగీకరించిందని అన్నారు. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను షేక్ హసీనా ఖండించారు. తనను రాజకీయంగా బలహీనపరచడానికి ఆ ఆరోపణలు చేశారని తెలిపారు. తనపై అభియోగాలు నమోదు చేసే ముందు బంగ్లాదేశ్‌లోని కోర్టులు తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తన వాదనలు వినిపించడానికి కూడా అవకాశమివ్వలేదని ఆమె అన్నారు.
Sheikh Hasina
Bangladesh
Delhi
Bangladesh Election
Awami League
Political Stability
Bangladesh Politics

More Telugu News