Nara Lokesh: మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Issues Alert for Next 48 Hours After Cyclone Montha
  • మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి లోకేశ్ సమీక్ష
  • తుపాను సహాయక చర్యలపై దృష్టిసారించిన మంత్రి
  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టం అంచనాపై ప్రత్యేక దృష్టి
  • ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచన
  • దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్న ఆదేశాలు
  • బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని దిశానిర్దేశం
మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో, ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తుపాను అనంతర పరిస్థితులపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. తుపాను నష్టం, సహాయక చర్యలపై లోకేశ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "రాబోయే 48 గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలి. భారీ వర్షాల కారణంగా రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలి" అని ఆదేశించారు.

పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని, దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని లోకేశ్ సూచించారు. మొంథా తీవ్ర తుపాను కారణంగా సంభవించిన ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై పూర్తి నివేదిక అందించాలని కోరారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న వంతెనలు, కల్వర్టులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. చెరువులు, కుంటలు, కాలువ గట్లను పటిష్టపరిచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. "అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనం ఔషధాలను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుపాను బాధితులు, మత్స్యకారులకు అవసరమైన నిత్యావసర సరకులను వెంటనే పంపిణీ చేయాలి" అని లోకేశ్ అధికారులను ఆదేశించారు.
Nara Lokesh
Cyclone Montha
Andhra Pradesh
AP floods
Nara Lokesh orders
Cyclone relief measures
Heavy rainfall
Crop damage assessment
Power restoration
Disaster management

More Telugu News