Suryakumar Yadav: భారత్-ఆస్ట్రేలియా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు

India vs Australia T20 Match cancelled due to Rain
  • కాన్‌బెర్రాలో వర్షం
  • భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ నిలిపివేత
  • వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్ స్కోర్ 97-1
  • దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్
భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు పటిష్ట స్థితిలో ఉండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) వేగవంతమైన ఆరంభాన్నిచ్చాడు. నాలుగు ఫోర్లతో దూకుడుగా ఆడిన అతను నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కేవలం 35 బంతుల్లోనే 62 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వద్ద ఉండగా, స్కోరు 97/1 వద్ద వర్షం మొదలైంది. ఆ సమయంలో గిల్ (20 బంతుల్లో 37*), సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39*) క్రీజులో ఉన్నారు.

వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు.. ఆటను కొనసాగించే పరిస్థితి లేదని నిర్ధారించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
Suryakumar Yadav
India vs Australia
T20 match
Shubman Gill
cricket
rain interruption
Nathan Ellis
cricket score
Abhishek Sharma
Canberra

More Telugu News