AP Government: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణికి ఏపీ సర్కార్ ఆదేశాలు

AP Government Orders Distribution of Essentials in Cyclone Affected Areas
  • ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ
  • ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, పప్పు, నూనె
  • మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం
  • వెంటనే సరఫరా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు
  • కూరగాయల పంపిణీ బాధ్యత మార్కెటింగ్ శాఖకు అప్పగింత
మోథా తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు, మత్స్యకారులకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ సంబంధిత అధికారులకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. తుపాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటరు వంట నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను ఉచితంగా అందించనున్నారు. తుపాను ప్రభావానికి ఎక్కువగా గురయ్యే మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలను అప్పగించింది. బియ్యం, కందిపప్పు, వంట నూనె, చక్కెర వంటి సరకుల సరఫరాను వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. అదేవిధంగా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు ఇతర కూరగాయల సేకరణ, పంపిణీ బాధ్యతలను మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. క్షేత్రస్థాయిలో బాధితులకు సకాలంలో సాయం అందేలా చూడాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 
AP Government
Cyclone Mandous
Andhra Pradesh
Cyclone Relief
AP Floods
AP Rain
Essential Commodities
Fishermen
Disaster Relief
Government Orders

More Telugu News