Parth H: జీతాలపై జోక్.. నెటిజన్ల చేతిలో చిక్కిన యువ పారిశ్రామికవేత్త!

Entrepreneurs Salary Joke Sparks Outrage Criticism
  • ఉద్యోగుల జీతాల ఆలస్యంపై ముంబై వ్యాపారవేత్త వ్యంగ్య పోస్ట్
  • ఆలస్యం కాదు, ఇది క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అని వ్యాఖ్య
  • లింక్డ్‌ఇన్‌లో పోస్ట్.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
  • అది నిజమైన మెయిల్ కాదని, కేవలం సరదాగా రాశానని వివరణ
ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త లింక్డ్‌ఇన్‌లో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. ఉద్యోగుల జీతాలు ఆలస్యమవ్వడంపై వ్యంగ్యంగా రాసిన ఓ 'క్షమాపణ' ఈమెయిల్‌ను ఆయన షేర్ చేయగా, అది కాస్తా బెడిసికొట్టింది. నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో చివరకు అది నిజం కాదని, కేవలం ఓ జోక్ మాత్రమేనని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

పార్థ్ హెచ్ అనే యువ వ్యాపారవేత్త ఇటీవల లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఉద్యోగుల జీతాలు ఆలస్యమైనందుకు క్షమాపణ చెబుతూ తనకు తాను రాసుకున్నట్లుగా ఉన్న ఓ ఈమెయిల్‌ను పంచుకున్నారు. "నిన్న నా ఉద్యోగులకు ఓ మెయిల్ పంపాను. 'జీతాలు ఆలస్యమైనందుకు క్షమించండి' అని చెప్పాను. కానీ, 'ఇది ఆలస్యం కాదు, క్యారెక్టర్ డెవలప్‌మెంట్' అని కూడా జోడించాను. ఎందుకంటే మనం కంపెనీ కాదు, జీతాల ద్వారా ఓపికను నేర్పించే ఒక స్పిరిచ్యువల్ స్టార్టప్" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అంతటితో ఆగకుండా "పెట్టుబడిదారులు దీన్ని సరైన నిర్వహణ కాదంటారు. నేను మాత్రం దీన్ని పెద్ద ఎత్తున మైండ్‌ఫుల్‌నెస్ అంటాను" అని ఆయన సెటైర్ వేశారు. అయితే, పార్థ్ ఉద్దేశించిన వ్యంగ్యం చాలా మందికి అర్థం కాలేదు. ఆయన నిజంగానే తన ఉద్యోగులను కించపరిచారని భావించి విమర్శించడం మొదలుపెట్టారు. 

"జీతాలు ఆలస్యంగా ఇచ్చినందుకు నిజాయతీగా క్షమాపణ చెప్పాలి గానీ, దాన్ని ఓపికపై పాఠంగా మార్చడం సరికాదు. మీరు నిజంగా ఈ మెయిల్ పంపలేదని ఆశిస్తున్నాను" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరొకరు, "భారత్‌లో ఉద్యోగులను చులకనగా చూడటం సాధారణమైపోయింది. ఈ సందేశం హాస్యంగా కాకుండా అహంకారంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

విమర్శలు పెరగడంతో పార్థ్ స్పందించారు. ఆ పోస్ట్ పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. "అది కచ్చితంగా వ్యంగ్యమే. మంచి అభ్యర్థులను వెతకడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏ సంస్థ కూడా జీతాలు ఇవ్వకుండా రిస్క్ తీసుకోదు" అని ఆయన వివరించారు.

అయితే, కొందరు పార్థ్‌కు మద్దతుగా నిలిచారు. "ఇలాంటివి నిజంగా జరుగుతాయని చాలా మంది నమ్మారంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని ఓ యూజర్ పేర్కొన్నాడు. దీనికి పార్థ్ స్పందిస్తూ "ఇంతమంది దీన్ని నిజమని అనుకుంటారని నేను ఊహించలేదు. జీతాల ఆలస్యం అనేది ఎంత సాధారణమైపోయిందో ఇది చూపిస్తోంది" అని అన్నారు. 
Parth H
Parth H LinkedIn
employee salaries
late salary payments
startup culture
corporate jokes
India jobs
employee exploitation
spiritual startup

More Telugu News