Karur stampede: ఆ 20 లక్షలు తిరిగిచ్చేసిన కరూర్ తొక్కిసలాట బాధితురాలు

Karur Stampede Victim Returns 20 Lakhs Sent by Vijay
  • తొక్కిసలాటలో భర్త రమేశ్ ను కోల్పోయిన సంఘవి
  • డబ్బు కోసం కాదు విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని వెల్లడి
  • చెన్నైలో విజయ్ తో జరిగిన సమావేశానికీ తాము వెళ్లలేదని వివరణ
కరూర్ తొక్కిసలాటలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత, నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతూ విజయ్ తమ ఖాతాలో జమ చేసిన రూ.20 లక్షలను తిప్పి పంపించింది. విజయ్ నుంచి తాము ఓదార్పు కోరుకున్నాం తప్ప డబ్బు కాదని చెప్పారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 27న కరూర్‌ లో నిర్వహించిన విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో రమేశ్ కూడా ఒకరు.

తొక్కిసలాట జరిగిన కొద్ది రోజులకు విజయ్ తమతో వీడియో కాల్ లో మాట్లాడారని రమేశ్ భార్య సంఘవి తెలిపారు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందుగా పరిహారం తీసుకోవాలని విజయ్ కోరారన్నారు. ఈ నెల 18న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరఫున తమ బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు జమ అయిందని వివరించారు. అయితే, తమకు డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని సంఘవి చెప్పారు.

తాజాగా కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను విజయ్ చెన్నైకి పిలిపించుకుని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారని సంఘవి గుర్తుచేశారు. ఆ సమావేశానికి తాము వెళ్లలేదని, తమ పేరు చెప్పుకుని తమ బంధువులు వెళ్లారని సంఘవి ఆరోపించారు. విజయ్ పరామర్శిస్తారని భావిస్తే డబ్బు పంపారని, ఆ డబ్బు తమకు అక్కర్లేదని తిప్పి పంపామని సంఘవి వివరించారు. డబ్బు తిప్పి పంపిన రశీదును ఆమె మీడియాకు చూపించారు.
Karur stampede
Victim money
20 lakhs reuturned
Vijay
Vijay TVK
Tamilaga Vetri Kazhagam
Sangavi
Ramesh death
Tamil Nadu politics
Vijay apology
TVK party

More Telugu News