Donald Trump: జపాన్‌లో ట్రంప్ తడబాటు.. అయోమయంలో అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్!

Donald Trumps Confused Moments in Japan Spark Controversy
  • జపాన్ పర్యటనలో ఇబ్బందికరంగా ప్రవర్తించిన ట్రంప్
  • గౌరవ వందనం స్వీకరణ సందర్భంగా ఆయన తీరు వైరల్
  • ప్రోటోకాల్ పాటించకుండా ముందుకు నడిచిన అధ్యక్షుడు
  • ట్రంప్ చర్యకు ఆశ్చర్యపోయిన జపాన్ ప్రధాని టకాయిచి
  • ట్రంప్ మానసిక ఆరోగ్యంపై మళ్లీ మొదలైన చర్చ
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో మాటల తడబాటుతో సోషల్ మీడియాలో మీమ్స్‌కు ఎలాగైతే కేంద్ర బిందువుగా మారారో, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు. జపాన్ పర్యటనలో అధికారిక కార్యక్రమం సందర్భంగా ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైన ఆయన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక దేశాధినేతగా గౌరవ వందనం స్వీకరించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా ట్రంప్‌కు తెలియదా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన ట్రంప్‌కు మంగళవారం టోక్యోలో ఆ దేశ నూతన ప్రధాని సనే టకాయిచి సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట‌ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సమయంలో ట్రంప్ తొలుత సెల్యూట్ చేయడానికి చెయ్యి పైకి ఎత్తారు. అయితే, అది ప్రోటోకాల్ కాదని గ్రహించారో ఏమో, వెంటనే దించేశారు.

ఆ తర్వాత జపాన్ ప్రధానితో కలిసి నడుస్తుండగా, ప్రోటోకాల్ ప్రకారం ఒకచోట ఆగాలని ప్రధాని టకాయిచి సైగ చేశారు. కానీ ట్రంప్ ఆ విషయాన్ని గమనించకుండా, తన ఆలోచనల్లో తాను ఉన్నట్లుగా ముందుకు నడిచి వెళ్లిపోయారు. దీంతో జపాన్ ప్రధాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నోరు తెరిచి చూస్తుండిపోయారు. ఆ తర్వాత ఆమె వేగంగా నడిచి ట్రంప్‌ను అందుకున్నారు.

అంతటితో ఆగలేదు. వేదిక వద్దకు వెళ్లే దారిని చూపిస్తూ ఒక సైనికాధికారి సైగ చేయగా, ట్రంప్ దాన్ని కూడా పట్టించుకోలేదు. ఏదో పార్కులో నడుస్తున్నట్లుగా నిదానంగా, నిరాసక్తంగా ముందుకు సాగిపోయారు. వాస్తవానికి ఆయన 90 డిగ్రీల కోణంలో వేదిక వైపు తిరగాల్సి ఉంది. చివరికి, జపాన్ ప్రధాని మరోసారి దారి చూపడంతో ట్రంప్ ఆమెను అనుసరించి ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించే వేదిక వద్దకు చేరుకున్నారు.

గత కొంతకాలంగా ట్రంప్ మానసిక ఆరోగ్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు ప్రపంచ నాయకుల పేర్లను, దేశాలను తికమకపడి పలికారు. భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుద్ధాన్ని సుంకాల ద్వారా ఆపానని చెప్పే క్రమంలో భారత్‌కు బదులుగా ఇరాన్ అని ప్రస్తావించారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ గార్ట్‌నర్ ఇటీవల మాట్లాడుతూ.. ట్రంప్ నడక, కదలికల్లో మార్పులు కనిపిస్తున్నాయని, ఇవి డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) ప్రారంభ లక్షణాలు కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. అధ్యక్షుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, మతిమరుపు లక్షణాలు లేవని స్పష్టం చేశాయి.
Donald Trump
Japan
Sanae Takaichi
US President
Viral Video
Protocol
Dementia
Joe Biden
Tokyo
gaffes

More Telugu News