Cyclone Montha: మొంథా తుపానును బలహీనపరిచిన 'విండ్ షీర్'.. ఊపిరి పీల్చుకున్న కోస్తా

Montha Cyclone Weakened by Wind Shear Relieves Coastal Andhra
  • నరసాపురం వద్ద తీరం దాటిన మొంథా తుపాను
  • 'విండ్ షీర్' కారణంగా తుపాను శక్తి కోల్పోయిందని వెల్లడి
  • తీరం తాకక ముందు కోనసీమలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు 
  • అంచనాల కన్నా తక్కువ ప్రభావంతో ముగిసిన గండం
  • ఊపిరి పీల్చుకున్న తీర ప్రాంత ప్రజలు, అధికారులు
  • తుపాను కారణంగా నిలిచిపోయిన వాయు, రైలు రవాణా
మూడు రోజులుగా తీర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మొంథా తుపాను, చివరికి ప్రశాంతంగా తీరం దాటింది. నరసాపురం సమీపంలో అర్ధరాత్రి గం. 1:00 సమయంలో తీరాన్ని తాకినప్పటికీ, అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నా, తుపాను కారణంగా వాయు, రైలు రవాణా సేవలు స్తంభించాయి.

ఎలా బలహీనపడింది?
వాస్తవానికి సముద్రంలో తీవ్ర తుపానుగా ఉన్నప్పుడు ఇది 2023లో వచ్చిన మిచాంగ్ తుపానును తలపించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, తీరానికి 70-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు 'విండ్ షీర్' (గాలుల కోత) ప్రభావానికి గురైంది. ఇది తుపాను కన్ను (సైక్లోన్ ఐ) భాగాన్ని దెబ్బతీయడంతో, గాలులు చెల్లాచెదురై తుపాను తన శక్తిని కోల్పోయింది. దీంతో తీరం దాటే సమయానికి గంటకు 70-80 కి.మీ. వేగంతో గాలులు వీచి, మోస్తరు వర్షాలకే పరిమితమైంది.

తీరం చేరకముందు కోనసీమలో అలజడి
తీరం దాటకముందు మొంథా తన ప్రభావాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాపై చూపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బలమైన ఈదురు గాలులకు అనేక కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రపు అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడి, దాదాపు 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది.  అయితే, రాత్రి 8 గంటల తర్వాత వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ప్రచండ గాలులు నిలిచిపోయి, భారీ వర్షం తగ్గుముఖం పట్టింది. మొత్తంమీద, భారీ విధ్వంసం సృష్టిస్తుందని భావించిన మోంథా తుపాను, స్వల్ప ప్రభావంతో గట్టెక్కింది.
Cyclone Montha
Andhra Pradesh cyclone
Bay of Bengal cyclone
Wind shear
Konaseema
Narasapuram
Coastal Andhra
IMD
Cyclone updates

More Telugu News