UAE Lottery: అమ్మ సెంటిమెంట్.. అబుదాబిలో ఏపీ యువకుడికి రూ. 240 కోట్ల జాక్‌పాట్!

Telugu expat Anilkumar Bolla won the UAE Lotterys first ever Dh100 million jackpot
  • ఏకంగా రూ. 240 కోట్లు గెలుచుకున్న అనిల్‌కుమార్‌
  • అమ్మ పుట్టినరోజు నంబర్‌తో అదృష్టాన్ని అందుకున్న వైనం
  • కుటుంబంతో యూఏఈలో స్థిరపడతానంటున్న విజేత
  • యూఏఈలో లాటరీపై పన్ను లేకపోవడంతో పూర్తి మొత్తం సొంతం
  • యూఏఈ లాటరీ చరిత్రలోనే ఇది అతిపెద్ద బహుమతి
అబుదాబిలో నివసిస్తున్న ఏపీకి చెందిన ఓ తెలుగు యువకుడిని అదృష్టం వరించింది. అమ్మపై ఉన్న ప్రేమ అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ని చేసింది. యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచిన 100 మిలియన్ దిర్హామ్‌లను (సుమారు రూ. 240 కోట్లు) గెలుచుకుని వార్తల్లో నిలిచారు. ఆ అదృష్టవంతుడి పేరు అనిల్‌కుమార్‌ బోళ్ల (29).

వివరాల్లోకి వెళితే.. చాలాకాలంగా అబుదాబిలో ఉంటున్న అనిల్‌కుమార్‌కు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల‌ 18న జరిగిన 'లక్కీ డే డ్రా'లో ఆయన విజేతగా నిలిచారు. తనకు జాక్‌పాట్ తగిలిన విషయాన్ని మొదట నమ్మలేకపోయానని ఆయన తెలిపారు. "జాక్‌పాట్‌ గెలిచారంటూ కాల్‌ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయాను. ఈ రోజుకూ ఇది నిజమా కాదా అనిపిస్తోంది" అని అనిల్‌ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

తన విజయ రహస్యాన్ని పంచుకుంటూ, "ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు. అందరిలానే టికెట్‌ కొన్నాను. కానీ, అందులో ఆఖరి నంబరు చాలా ప్రత్యేకం. మా అమ్మ పుట్టినరోజునే ఆ నంబరుగా ఎంచుకున్నాను" అని చెక్కు అందుకున్న సందర్భంగా అనిల్‌ వివరించారు. ఈ భారీ మొత్తాన్ని ఏం చేయబోతున్నారని అడగ్గా, తెలివైన పెట్టుబడులు పెట్టడంతో పాటు తన చిరకాల కోరికైన సూపర్‌ కారు కొంటానని చెప్పారు. కుటుంబసభ్యులను యూఏఈకి తీసుకొచ్చి వారితో కలిసి ఇక్కడే స్థిరపడతానని, వారి కోరికలు తీరుస్తానని తెలిపారు. అలాగే, గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని ఛారిటీలకు విరాళంగా ఇస్తానని తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

పన్నుల భారం లేదు
యూఏఈలో లాటరీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. దీంతో అనిల్ పూర్తి మొత్తాన్ని, అంటే రూ. 240 కోట్లను పన్ను చెల్లించకుండానే అందుకుంటారు. అదే భారత్‌లో ఎవరైనా ఇంత పెద్ద మొత్తం గెలిస్తే, దాదాపు 30 శాతం ఫ్లాట్ పన్ను, సర్‌చార్జ్‌, సెస్‌ రూపంలో సుమారు రూ. 86 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పన్నులన్నీ పోగా, విజేతకు దాదాపు రూ. 154 కోట్లు మాత్రమే చేతికి అందేవి. కాగా, ఇదే డ్రాలో మరో 10 మంది కూడా తలా 10 వేల దిర్హామ్‌లు (రూ. 24 లక్షలు) గెలుచుకోవడం విశేషం.
UAE Lottery
Anilkumar Bolla
Anil Kumar
Abu Dhabi
Jackpot
Lucky Day Draw
Andhra Pradesh
AP Youth
Lottery Winner
Million Dirhams

More Telugu News