Indian Oil Corporation: ట్రంప్ ఆంక్షలు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొచ్చు కానీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

Indian Oil Corporation can buy oil from Russia despite Trump sanctions
  • ఆంక్షల పరిధిలోకి రాని రష్యా కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేయవచ్చని వెల్లడి
  • రాస్‌నెఫ్ట్, లుక్ఆయిల్ చమురు ఎగుమతి సంస్థలపై ఆంక్షలు విధించిందని వెల్లడి
  • ఆంక్షలు రష్యా సరఫరాదారులకే వర్తిస్తాయని స్పష్టీకరణ
రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని ఏ కంపెనీ అయినా రాయితీ ధరకు చమురు సరఫరా చేయడానికి ముందుకు వస్తే కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని ఐవోసీ డైరెక్టర్ అనుజ్ జైన్ స్పష్టం చేశారు. ఆంక్షలు లేని రష్యా కంపెనీల నుంచి చమురును కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో గత వారం రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, లుక్ఆయిల్ చమురు ఎగుమతి సంస్థలపై ఆంక్షలు విధించింది. అమెరికా ఆంక్షలు విధించిన సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆంక్షల పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆంక్షలు లేని కంపెనీల నుంచి మాత్రం దిగుమతి చేసుకోవడంలో ఇబ్బంది లేదని వారు అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహా ఇతర భారత చమురు సంస్థలు రష్యా నుంచి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు కేవలం రష్యాకు చెందిన సరఫరాదారులకే వర్తిస్తాయని, ఆంక్షలు లేని కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేయడానికి వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Indian Oil Corporation
Russia oil
Ukraine war
US sanctions
Anuj Jain
Rosneft
Lukoil
India Russia trade

More Telugu News