Nara Lokesh: తుపాను తీరం దాటిన వెంటనే సహాయక చర్యలు మొదలవుతాయి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Relief efforts begin immediately after cyclone landfall
  • ఏపీపై మొంథా తుపాను ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • తుపాను సహాయక చర్యలకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధం
  • విద్యుత్, రహదారుల పునరుద్ధరణే తొలి ప్రాధాన్యత అన్న లోకేశ్
  • ప్రతి రెండు గంటలకు ఒకసారి సీఎం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
  • సుమారు 43 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా
  • ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వ విజ్ఞప్తి
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని నివారించేందుకు, ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.

తుపాను తీరం దాటిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని ఆయన తెలిపారు. "విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం మా తొలి ప్రాధాన్యత. రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు జేసీబీలను, ఇతర యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా, అవసరమైన చోట జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచాం" అని లోకేశ్ వివరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ఆర్టీజీఎస్‌ ద్వారా రాత్రంతా పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

తుపాను సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ముఖ్యంగా బీచ్‌ల వద్దకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతూ, సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు.

భారీ వర్షాలు, పంట నష్టం

మొంథా తుపాను కారణంగా గడిచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 43 వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పూర్తిస్థాయి నష్టంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇక, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై లోకేశ్ మాట్లాడుతూ.. "ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, ప్రజలను కాపాడుకోవడమే మా కర్తవ్యం. వాళ్ల రాజకీయాల గురించి తర్వాత మాట్లాడతాను" అని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Cyclone Montha
Andhra Pradesh
Cyclone relief measures
AP floods
Heavy rains
Crop damage
Vishakha
Konaseema
Srikakulam

More Telugu News