Akkineni: అప్పట్లో ఆత్రేయపై కోప్పడిన అక్కినేని .. కారణం అదేనట!

Jayakumar Interview
  • 'శ్రీ రంగనీతులు' గురించి ప్రస్తావించిన జయ కుమార్
  • వెంటనే ట్యూన్ కట్టేసిన చక్రవర్తి  
  • పాట రాయడానికి సమయం తీసుకున్న ఆత్రేయ
  • ఆలస్యం కావడంతో కోప్పడిన అక్కినేని  

అక్కినేని సినిమాలలో అనేక పాటలు సూపర్ హిట్. ఆ పాటలలో ఆత్రేయ రాసినవి కూడా చాలానే ఉంటాయి. అలాంటి ఆత్రేయపై అక్కినేని సీరియస్ అయిన సందర్భం ఒకటి ఉందని, తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్యూలో దర్శకుడు కనకాల జయకుమార్ చెప్పారు. "అది 'శ్రీరంగనీతులు' సినిమా .. నాగేశ్వరరావుగారి సొంత సినిమా. ఆయన సరసన నాయికగా శ్రీదేవిగారు నటిస్తున్నారు. ఆ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకుడైతే, చక్రవర్తి సంగీత దర్శకుడు" అని చెప్పారు. 

'శ్రీరంగనీతులు' సినిమాకి ఓ పాట రాయడానికి ఆత్రేయగారిని పిలిపించారు. ఆ సినిమాకి నేను కో - డైరెక్టర్ గా ఉన్నాను. ఆత్రేయగారు అశోక హోటల్లో దిగారు. చక్రవర్తి గారు ఒక్క రోజులోనే ట్యూన్ ఇచ్చారు. అయితే ఆత్రేయగారు మాత్రం అలా ఆలోచన చేస్తూ కూర్చునేవారు. పాట ఎంతవరకూ వచ్చిందని నాగేశ్వరరావు గారు అడిగితే, ఇంకా ఏమీ రాలేదని అనేవారు. అలా వారం రోజులు గడిచిపోయాయి. దాంతో నాగేశ్వరరావుగారికి కోపం వచ్చేసింది. ఇక మద్రాస్ వెళ్లిపోవచ్చని కోపంగా అన్నారు" అని చెప్పారు. 

"నాగేశ్వరరావుగారు అలా అనగానే ఆత్రేయగారు హోటల్ కి వచ్చేశారు. కనీసం పల్లవి అయినా రాయమని ఆయనను కోదండరామిరెడ్డిగారు బ్రతిమాలారు. ఆత్రేయగారు ఒక నిద్ర తీసిన తరువాత నన్ను పిలిచారు. పాట రాసుకోమని చెప్పి పల్లవి చెప్పారు. అలా ఆయన రాసినదే 'కళ్లు ఓకే .. నడుము ఓకే .. నడక ఓకే' అనే పాట. ఉదయాన్నే ఆ పాట పట్టుకుని వెళ్లి ఇస్తే, అప్పుడు అక్కినేని కూల్ అయ్యారు" అని అన్నారు.       

Akkineni
Akkineni Nageswara Rao
ANR
Atreya
Sriranganeethulu Movie
Kanakala Jayakumar
Telugu Cinema
Tollywood
Sridevi
Kodandaramireddy

More Telugu News