Adivi Sesh: అడివి శేష్ 'డెకాయిట్' వాయిదా... కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Adivi Sesh Dacoit Release Date Postponed to March 19 2026
  • ఈ ఏడాది డిసెంబర్ 25న రావాల్సిన సినిమా
  • 2026 మార్చి 19న కొత్త రిలీజ్ డేట్ ఖరారు
  • ఉగాది, ఈద్ పండగలను టార్గెట్ చేసిన చిత్రబృందం
  • యాక్షన్ సీన్‌లో శేష్‌కు గాయాలు కావడమే కారణమంటున్న నివేదికలు
  • హీరోయిన్‌గా మృణాల్, కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'డెకాయిట్' విడుదల తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, తాజాగా తేదీని మార్పు చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమాను 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ కొత్త విడుదల తేదీని అడివి శేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఈసారి మామూలుగా ఉండదు. వెనక్కి తగ్గేదే లేదు. #DACOIT ఈ ఉగాదికి 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది" అని పోస్ట్ చేశారు. ఉగాది, ఈద్ పండగల సందర్భంగా వస్తున్న లాంగ్ వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ తేదీని ఖరారు చేశారు. కాగా, ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా అడివి శేష్ గాయపడటంతోనే సినిమా విడుదల వాయిదా పడిందని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

"డెకాయిట్" చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తనను మోసం చేసిన మాజీ ప్రియురాలిపై కోపంతో రగిలిపోతూ, పగ తీర్చుకోవాలనుకునే ఓ ఖైదీ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి అంశాలతో ఈ కథ ఉద్వేగభరితంగా సాగనుంది. ఈ చిత్రం ద్వారా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అడివి శేష్, షానియల్ డియో కలిసి ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను మహారాష్ట్రలో ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Adivi Sesh
Dacoit movie
Mrunal Thakur
Anurag Kashyap
Telugu cinema
Release date
Action thriller
Pan India movie
Supriya Yarlagadda
Annapurna Studios

More Telugu News