Rajinikanth: ఆగని బెదిరింపులు.. ఈసారి రజనీ, ధనుష్ టార్గెట్‌గా ఈమెయిల్

Rajinikanth and Dhanush Targeted in New Bomb Threat
  • తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం
  • కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై ఇంటికి కూడా బెదిరింపులు
  • డీజీపీ కార్యాలయానికి వచ్చిన మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు
తమిళనాడులో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో వరుసగా సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటుడు ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. వీరితో పాటు టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని కూడా పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు.

వివరాల్లోకి వెళితే... చెన్నైలోని డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ అందింది. అందులో పొయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్, ధనుష్ నివాసాలతో పాటు కీల్పాక్కంలో ఉన్న కాంగ్రెస్ నేత సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేస్తామని ఆగంతకులు హెచ్చరించారు. ఈమెయిల్ అందిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను హుటాహుటిన రంగంలోకి దించారు. సంబంధిత ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ఇటీవల కాలంలో తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. ఈ నెల 3న ముఖ్యమంత్రి స్టాలిన్, నటి త్రిష నివాసాలు, బీజేపీ కార్యాలయంతో పాటు డీజీపీ ఆఫీసుకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. అలాగే, అక్టోబర్ 13న కూడా సీఎం స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడం గమనార్హం. ఈ వరుస ఘటనలతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

తాజా ఘటన నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భద్రతను పెంచారు. ఈమెయిల్ ఎవరు పంపారనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస బెదిరింపుల వెనుక ఒకే ముఠా హస్తం ఉందా? లేక వేర్వేరు వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Rajinikanth
Rajinikanth bomb threat
Dhanush
Dhanush bomb threat
TNCC Selvaperunthagai
Selvaperunthagai bomb threat
Chennai bomb threat
Tamil Nadu bomb threat
Stalin bomb threat
Trisha bomb threat

More Telugu News