Sajjanar: వాట్సాప్, ఫోన్‌కాల్స్ కొత్త నిబంధనలు అంటూ పోస్టర్... స్పందించిన హైదరాబాద్ పోలీసులు, సీపీ సజ్జనార్

Sajjanar Reacts to WhatsApp Phone Call New Rules Rumors
  • కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడతాయంటూ ప్రచారం
  • అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేయబడతాయని ప్రచారం
  • పోలీసుల పేరిట అవాస్తవ ప్రచారం జరుగుతోందని హైదరాబాద్ పోలీసులు స్పష్టీకరణ
వాట్సాప్, ఫోన్‌కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయంటూ జరుగుతోన్న ప్రచారంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. 'రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ నియమాలు అమలు చేయబడుతున్నాయి' అంటూ తెలంగాణ పోలీస్ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. తాము విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, కానీ అది వాస్తవం కాదని స్పష్టం చేశారు.

అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేయబడుతాయని, సామాజిక మాధ్యమ ఖాతాలను పోలీసులు పర్యవేక్షిస్తారని, మీ డివైస్ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ చేయబడుతుందంటూ పలు సూచనలతో ఒక పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని ఎవరూ నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.

"తప్పుడు సమాచారంతో కూడిన డిజిటల్ పోస్టర్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దానిని విడుదల చేయలేదు. ధృవీకరించుకోకుండా అలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్ లేదా ఫార్వార్డ్ చేయవద్దు. ఇలాంటి నకిలీ సమాచారం గురించి మీకు తెలిస్తే ఫిర్యాదు చేయండి" అని ఎక్స్ వేదికగా కోరారు. దీనిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్యాక్ట్ చెక్ పేరుతో రీట్వీట్ చేశారు.
Sajjanar
Hyderabad Police
WhatsApp
Phone Calls
Fake News
Social Media
Telangana Police

More Telugu News