Chernobyl dogs: చెర్నోబిల్‌లో వింత.. నీలి రంగులోకి మారిన శునకాలు!

Chernobyl Stray Dogs Mysterious Blue Fur
  • ఫోటోలను పంచుకున్న 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' అనే సంస్థ
  • ఏదో రసాయనం కారణంగానే ఇలా జరిగిందని అనుమానం
  • కుక్కలు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని వెల్లడి
ఉక్రెయిన్ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివసించే కొన్ని కుక్కల బొచ్చు ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారింది. ఈ షాకింగ్ ఫోటోలను 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' అనే స్వచ్ఛంద సంస్థ పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

1986 చెర్నోబిల్ అణు విపత్తు తర్వాత యజమానులు వదిలివెళ్లిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందినవే ఈ శునకాలు. మానవ సంచారం లేని ఈ ప్రాంతంలో వన్యప్రాణులతో పాటు ఈ కుక్కలు జీవిస్తున్నాయి. ఇక్కడి దాదాపు 700 కుక్కలకు 'డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్' సంస్థ ఆహారం, ఆశ్రయం, వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవలే రొటీన్ స్టెరిలైజేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా మూడు కుక్కలు ఇలా వింతగా నీలి రంగులో కనిపించాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారం రోజుల క్రితం వరకు అవి సాధారణంగానే ఉన్నాయని స్థానికులు చెప్పడంతో ఈ మార్పుపై ఆసక్తి పెరిగింది.

ఈ కుక్కలు ఏదైనా తెలియని రసాయన పదార్థాన్ని తాకడం వల్లే వాటి బొచ్చు రంగు మారి ఉండవచ్చని సంరక్షకులు అనుమానిస్తున్నారు. పారిశ్రామిక రసాయనాలు లేదా పర్యావరణంలోని భారీ లోహాల ప్రభావం కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అసలు కారణం తెలుసుకునేందుకు పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరించే పనిలో పడ్డారు.

"ఈ రంగు మార్పుకు కచ్చితమైన కారణం ఏంటో మాకు తెలియదు. వాటిని పట్టుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా ఇవి ఏదైనా రసాయనాన్ని తాకి ఉండొచ్చు. ప్రస్తుతం అవి చాలా చురుకుగా ఉన్నాయి. అందుకే వాటిని పట్టుకోవడం సాధ్యం కాలేదు" అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వింత రంగులో కనిపిస్తున్నప్పటికీ, ఈ కుక్కలు చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని సంరక్షకులు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పరీక్షల తర్వాతే ఈ రంగు మార్పు వెనుక ఉన్న అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.
Chernobyl dogs
Chernobyl
dogs
blue dogs
Ukraine
animal mutation
radiation
Dogs of Chernobyl
animal welfare
stray dogs

More Telugu News