Dharmapuri Arvind: కవిత, రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్లు: బీజేపీ ఎంపీ అర్వింద్

Dharmapuri Arvind Alleges Kavitha and Revanth Reddy are Business Partners
  • రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే కవిత నడుస్తున్నారన్న అర్వింద్
  • కవిత చేపట్టిన 'జనం బాట' యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని వ్యాఖ్య
  • ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామాను ఆమోదించాలని డిమాండ్
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే కవిత నడుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కవిత చేపట్టిన 'జనం బాట' యాత్రపై ఆయన తీవ్రంగా స్పందించారు.

"అసలు కవిత ఎవరు? జాగృతి ఏంటి?" అని ప్రశ్నించారు. కవిత 'జనం బాట' యాత్ర తీహార్ జైలుకు దారితీస్తుందని, మూడు నాలుగేళ్లలో ఆమె ఆశయం నెరవేరుతుందని ఎద్దేవా చేశారు. గతంలో కాంట్రాక్టర్లు ఆమె వేధింపులకు భయపడి పారిపోయారని ఆరోపించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగకూడదనే కుటిల ఆలోచనతోనే కల్వకుంట్ల కుటుంబం బీసీ, ఎస్సీ, ఎస్టీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపిందని విమర్శించారు. ఒక తరాన్ని మొత్తం అణగదొక్కిన చరిత్ర వారిదని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని బీజేపీ తరఫున మండలి ఛైర్మన్‌కు లేఖ రాస్తున్నట్లు అరవింద్ తెలిపారు. "రేవంత్ రెడ్డికి, కవితకు మధ్య ములాఖత్ ఏంటి? ఆమె రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదు?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కవితతో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిద్దరూ బిజినెస్ పార్ట్‌నర్లు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ కవిత 'జనం బాట' పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర దాదాపు నాలుగు నెలల పాటు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో తన తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా, కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతోనే ఆమె ప్రజల్లోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 
Dharmapuri Arvind
MLC Kavitha
Revanth Reddy
BJP
Telangana Politics
Janam Bata Yatra
Nizamabad
BRS Party
KCR
Fee Reimbursement

More Telugu News