Chandrababu Naidu: మొంథా ముప్పు: మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష.. సహాయక చర్యలకు పిలుపు

Chandrababu reviews Montha cyclone preparations with officials
  • మొంథా తుపానుపై ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • నేడు, రేపు ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • ఈ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్ష సూచన
  • సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
రాష్ట్రంపైకి దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్డీయే కూటమి శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈరోజు ఆయన ఎన్డీయే కూటమికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. లీడర్ల నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మొంథా తుపాను కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు పయనిస్తోందని సీఎం వివరించారు. ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా బలపడి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించడంతో పాటు, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే మన లక్ష్యం. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలకు రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నాం. పంటలను ముంపు నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఇప్పటికే సూచనలు చేశాం" అని ఆయన తెలిపారు. ఎన్డీయే కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు.

తుపాను సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను క్షేత్రస్థాయిలో మోహరించినట్లు సీఎం వెల్లడించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించామని, వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గతంలో తిత్లీ, హుద్‌హుద్ వంటి పెను తుపానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా పనిచేయాలని సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కోరతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 
Chandrababu Naidu
Montha cyclone
Andhra Pradesh cyclone
Cyclone relief measures
NDRF
SDRF
Kakinada
Machilipatnam
Kalingapatnam
Heavy rainfall

More Telugu News