Chris Broad: భారత్‌ను కాపాడమని ఫోన్ కాల్ వచ్చింది.. బీసీసీఐపై ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు

Chris Broad Alleges BCCI Interference in ICC Decisions
  • టీమిండియాను జరిమానాల నుంచి కాపాడేందుకు రాజకీయ ఒత్తిడి తెచ్చారన్న మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్  
  • స్లో ఓవర్ రేట్ ఫైన్ నుంచి తప్పించేందుకు తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఆరోపణ
  • ఒత్తిడి కారణంగా సమయాన్ని మార్చి భారత్‌కు ఫైన్ పడకుండా చేశానని వ్యాఖ్య
  • డబ్బుతో ఐసీసీని బీసీసీఐ తన అధీనంలోకి తీసుకుందని విమర్శ
బీసీసీఐపై ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవీకాలంలో టీమిండియాను జరిమానాల నుంచి కాపాడేందుకు బీసీసీఐ రాజకీయ పలుకుబడిని ఉపయోగించిందని ఆయన ఆరోపించాడు. ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి అయిన క్రిస్ బ్రాడ్, ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.

ఒకానొక మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు జరిమానా విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయితే ఆ సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని క్రిస్ బ్రాడ్ తెలిపాడు. "భారత జట్టుపై కాస్త ఉదారంగా వ్యవహరించండి. జరిమానా పడకుండా ఉండేందుకు ఏదైనా మార్గం చూడండి" అని ఆ ఫోన్ కాల్‌లో తనకు సూచించినట్లు ఆయన చెప్పాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉందని, నిబంధనల ప్రకారం అది కచ్చితంగా జరిమానా విధించాల్సిన తప్పిదమని అన్నాడు. కానీ, బీసీసీఐ నుంచి వచ్చిన ఒత్తిడితో తాను నిబంధనలను పక్కనపెట్టి, మ్యాచ్ సమయాన్ని మార్చి జరిమానా పరిధిలోకి రాకుండా చూడాల్సి వచ్చిందని బ్రాడ్ వివరించాడు.

'ది టెలిగ్రాఫ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "భారత్ వద్దే డబ్బు మొత్తం ఉంది. ఇప్పుడు వారు ఐసీసీని కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. అందుకే ఇప్పుడు నేను ఆ పదవిలో లేనందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు క్రికెట్‌లో రాజకీయాలు బాగా పెరిగిపోయాయి" అని వ్యాఖ్యానించాడు

ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైందని బ్రాడ్ గుర్తుచేసుకున్నాడు. "మరుసటి మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. స్లో ఓవర్ రేట్‌పై నేను ఇచ్చిన హెచ్చరికలను వారు (సౌరవ్ గంగూలీ) పట్టించుకోలేదు. అప్పుడు నేను ఫోన్ చేసి 'ఇప్పుడు ఏం చేయమంటారు?' అని అడిగాను. దానికి 'ఈసారి ఫైన్ వేసేయండి' అని సమాధానం వచ్చింది. దీన్ని బట్టి మొదటి నుంచి రాజకీయాలు ఉన్నాయని అర్థమవుతోంది" అని ఆయన ఆరోపించాడు.

క్రిస్ బ్రాడ్ తన కెరీర్‌లో 123 టెస్టులకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు. 2024 ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన మ్యాచే ఆయనకు చివరిది.
Chris Broad
BCCI
ICC
match referee
slow over rate
Sourav Ganguly
India cricket
cricket politics
Stuart Broad
cricket penalty

More Telugu News