AP Government: పతకాలు సాధించిన క్రీడాకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. నగదు ప్రోత్సాహకాలకు దరఖాస్తులు ఆహ్వానం

AP Government Announces Cash Incentives for Medal Winning Athletes
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు
  • ఏపీకి చెందిన అథ్లెట్ల కోసం 'నగదు ప్రోత్సాహక పథకం'
  • నవంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువు
  • శాప్ క్రీడా యాప్ లేదా ప్రత్యేక లింక్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్న శాప్ చైర్మన్ రవినాయుడు
జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'నగదు ప్రోత్సాహక పథకం' కింద అర్హులైన వారికి పారితోషికం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించింది. 

ఈ విషయంపై శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం గర్వించేలా పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. "ఆసక్తిగల క్రీడాకారులు 'శాప్‌ క్రీడాయాప్‌' (SAAP Kreeda App) లేదా అధికారిక లింక్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోం" అని ఆయన స్పష్టం చేశారు. 

ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్రీడాకారులు 95735 52108, 82473 02497, 95538 21065 నంబర్లలో సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
AP Government
Andhra Pradesh sports
SAAP
cash incentives
sports awards
Ravinaidu
sports policy Andhra Pradesh
AP sports authority
sports news
medal winners

More Telugu News