Amrita Chauhan: ఫోరెన్సిక్ తెలివితో ప్రియుడి హత్య.. వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఘాతుకం!

Forensic Student Kills Lover Over Private Videos in Delhi
  • సహజీవన భాగస్వామిని హత్య చేసిన ఫోరెన్సిక్ విద్యార్థిని
  • ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయలేదని ప్రియుడిపై కక్ష
  • మాజీ ప్రియుడి సహాయంతో హత్యకు పక్కా ప్లాన్
  • హత్యను గ్యాస్ సిలిండర్ పేలుడుగా చిత్రీకరించే యత్నం
  • మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా చిక్కిన నిందితులు
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
 తన ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయలేదన్న కోపంతో ఓ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని తన సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా హత్య చేసింది. మాజీ ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడి, హత్యను గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన అమృతా చౌహాన్ (21) ఫోరెన్సిక్ సైన్స్ చదువుతోంది. ఆమెకు యూపీఎస్సీకి సిద్ధమవుతున్న రాంకేశ్ మీనా (32)తో పరిచయం ఏర్పడింది. గత మే నెల నుంచి ఢిల్లీలోని గాంధీ విహార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో రాంకేశ్ తనకు తెలియకుండా కొన్ని ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశాడని అమృత గుర్తించింది. వాటిని వెంటనే డిలీట్ చేయాలని కోరినా అతడు నిరాకరించడంతో, ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని తన మాజీ ప్రియుడు సుమిత్‌కు చెప్పి, అతడి సహాయం కోరింది. ఫోరెన్సిక్ విద్యార్థిని కావడం, క్రైం వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూడటంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా హత్యకు పక్కా ప్లాన్ వేసింది. గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న సుమిత్ అనుభవాన్ని కూడా వాడుకోవాలని నిర్ణయించుకుంది. వీరి కుట్రలో మరో స్నేహితుడు సందీప్ కుమార్‌ను కూడా చేర్చుకున్నారు.

ఈ నెల 5న ముగ్గురూ కలిసి మొరాదాబాద్ నుంచి ఢిల్లీలోని రాంకేశ్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. మొదట రాంకేశ్‌ను తీవ్రంగా కొట్టి, ఆపై గొంతు నులిమి హత్య చేశారు. మంటలు వేగంగా వ్యాపించడం కోసం మృతదేహంపై నెయ్యి, నూనె, ఆల్కహాల్ పోశారు. అనంతరం సుమిత్ గ్యాస్ సిలిండర్‌కు చిన్న రంధ్రం చేసి గది మొత్తం గ్యాస్ వ్యాపించేలా చేశాడు. తర్వాత లైటర్‌తో నిప్పంటించి, బయటి నుంచి అనుమానం రాకుండా గదికి లోపలి నుంచి గడియపెట్టి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆధారాలు నాశనం చేసేందుకు రాంకేశ్ ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లారు.

వారు వెళ్లిన గంట తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. తొలుత షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీ పేలుడుగా భావించిన పోలీసులకు, ఫోరెన్సిక్ నివేదికతో ఇది హత్య అని నిర్ధారణ అయింది. ఘటన జరిగిన సమయంలో అమృత మొబైల్ ఫోన్ లొకేషన్ అదే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
Amrita Chauhan
Delhi crime
murder case
forensic science student
live-in partner
crime web series
gas cylinder blast
Sumit
Sandeep Kumar
private videos

More Telugu News