Cyclone Montha: మొంథా తుపాను ఎఫెక్ట్... పలు విమాన సర్వీసులు రద్దు

Cyclone Montha Flight Services Cancelled at Vijayawada Airport
  • ఎయిరిండియాకు చెందిన పలు విమానాలను రద్దు చేసిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ
  • రద్దయిన వాటిలో షార్జా అంతర్జాతీయ సర్వీసులు కూడా 
  • హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం సర్వీసులపై కూడా ప్రభావం
తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాను రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా, తాజాగా విమానయాన సర్వీసులపై కూడా తుఫాను ప్రభావం పడింది. ముందుజాగ్రత్త చర్యగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
 
మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 28వ తేదీన ఎయిరిండియాకు చెందిన పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి. రద్దయిన విమానాల జాబితాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ విడుదల చేసింది.
 
రద్దయిన విమాన సర్వీసులు ఇవీ

IX 2819: విశాఖపట్నం - విజయవాడ
IX 2862: విజయవాడ - హైదరాబాద్‌
IX 2875: బెంగళూరు - విజయవాడ
IX 2876: విజయవాడ - బెంగళూరు
IX 976: షార్జా - విజయవాడ
IX 975: విజయవాడ - షార్జా
IX 2743: హైదరాబాద్‌ - విజయవాడ
IX 2743: విజయవాడ - విశాఖపట్నం
 
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన, అలాగే విజయవాడకు రావాల్సిన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఇందులో షార్జా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన అంతర్జాతీయ విమానాలు కూడా ఉండటం గమనార్హం. తుఫాను పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. 
Cyclone Montha
Montha Cyclone
Vijayawada Airport
Flight Cancellations
Air India
Visakhapatnam
Hyderabad
Sharjah
October 28
Weather Alert

More Telugu News