AV Ranganath: హైడ్రా ప్రజావాణికి కబ్జా ఫిర్యాదుల వెల్లువ.. సాక్ష్యాలతో తరలివస్తున్న జనం

Land Grabbing Complaints Surge at HYDRAA Prajavani in Hyderabad
  • హైడ్రా ప్రజావాణికి పోటెత్తిన భూకబ్జా ఫిర్యాదులు
  • ఒక్కరోజే 52 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు
  • ఫొటోలు, వీడియోలతో సాక్ష్యాలు అందిస్తున్న నగరవాసులు
  • చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎక్కువగా ఫిర్యాదులు
  • హస్మత్‌పేటలో 28 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై  ఆరోపణలు
  • ఫిర్యాదులను నేరుగా పర్యవేక్షిస్తున్న కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్‌లో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై నగరవాసులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు హైడ్రా ప్రజావాణిలో తక్షణ పరిష్కారం లభిస్తుండటంతో, బాధితులు సాక్ష్యాలతో సహా కార్యాలయానికి క్యూ కడుతున్నారు. సోమవారం ఒక్కరోజే ప్రజావాణికి ఏకంగా 52 ఫిర్యాదులు అందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేరుగా పర్యవేక్షిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రజలు, తమ సమస్యలను ఫొటోలు, వీడియోల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు. రోడ్లను ఆక్రమిస్తే ఫొటోలు, చెరువులను కబ్జా చేస్తుంటే వీడియోలతో సహా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు బాహాటంగా తమ వివరాలు వెల్లడిస్తుంటే, మరికొందరు తమ పేర్లను గోప్యంగా ఉంచాలని కోరుతున్నారు. గంటల్లో, రోజుల్లోనే తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకంతోనే వస్తున్నామని పలువురు చెబుతున్నారు.

ప్రభుత్వ భూములు, చెరువులే లక్ష్యం
ప్రజావాణికి అందిన ఫిర్యాదుల్లో ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం హస్మత్‌పేట్‌లోని సర్వే నంబర్ 1లో ఉన్న 28.28 ఎకరాల చారిత్రక ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఆక్రమించి ప్లాట్లుగా అమ్ముతున్నారని ఓల్డ్ బోయిన్‌పల్లి వాసులు ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా, శంషాబాద్ పరిధిలోని నరసింహ కుంట తూములు మూసేయడంతో పంట పొలాలు, ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని 22 ఎకరాల శాంబుని కుంట ఆక్రమణలతో ఆరేడు ఎకరాలకు పరిమితమైందని, కూకట్‌పల్లిలోని పరికి చెరువులో 12 ఎకరాలను రాత్రికి రాత్రే మట్టితో పూడ్చేస్తున్నారని స్థానికులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. సాగర్ రోడ్డులో కాలనీ రోడ్లను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారని, అమీన్‌పూర్ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకున్న వారిపై దాడులు చేస్తూ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని పలువురు వాపోయారు.

ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు వాటిని అప్పగించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
AV Ranganath
HYDRAA Prajavani
Hyderabad land grabbing
HMDA complaints
Telangana land disputes
illegal constructions Hyderabad
lake encroachment Hyderabad
government land grabbing
Ameenpur lake
Hasmatpet land

More Telugu News