Montha Cyclone: ఏపీ కోస్తాపై మొదలైన 'మొంథా' తుపాను ప్రభావం

Montha Cyclone Impact Begins on AP Coast
  • ఏపీ తీరం వైపు 'మొంథా' తుపాను
  • రేపటికి తీవ్రరూపం దాల్చే అవకాశం
  • పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు
  • ప్రస్తుతం కాకినాడకు 570 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • తీరం వెంబడి గంటకు 110 కి.మీ వేగంతో గాలులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుపాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, 'మొంథా' తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాను మరింత బలపడి రేపు (మంగళవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Montha
Bay of Bengal
AP Coast
Kakinada
Visakhapatnam
Weather Forecast
Cyclone Alert

More Telugu News