Chandrababu: మొంథా తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రధాని మోదీ ఫోన్, యంత్రాంగానికి కీలక ఆదేశాలు

Chandrababu Reviews Montha Cyclone Impact PM Modi Calls
  • మొంథా తుపానుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష
  • సీఎంకు ఫోన్ చేసి వివరాలు అడిగిన ప్రధాని మోదీ
  • కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను
  • రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని అంచనా
  • కృష్ణా జిల్లాకు అతి భారీ వర్ష సూచన
  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాను పరిస్థితిపై ఆరా తీశారు.

ప్రస్తుతం మొంథా తుపాను కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ గంటకు తుపాను కదలికలను గమనిస్తూ, వర్షాలు, వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేశ్‌, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu
Montha Cyclone
Andhra Pradesh
Narendra Modi
Cyclone Alert
Heavy Rains
AP Government
Nara Lokesh
Krishna District
Weather Forecast

More Telugu News