Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ రేసులో అనూహ్య మలుపు.. జోహ్రాన్ మమ్దానీకి మస్క్ మద్దతు

Zohran Mamdani Gets Elon Musk Support in New York Mayor Race
  • డెమోక్రాటిక్ పార్టీ భవిష్యత్తు జోహ్రాన్ మమ్దానీనే అన్న ఎలాన్ మస్క్
  • న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ చేస్తున్న మమ్దానీ
  • గవర్నర్ కేథీ హోచుల్ సైతం మమ్దానీకి మద్దతుగా ప్రచారం
  • సరసమైన గృహాలు, సంపన్నులపై పన్నులు మమ్దానీ ప్రధాన అజెండా
  • మమ్దానీ వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విమర్శలు
  • రిపబ్లికన్, స్వతంత్ర అభ్యర్థులతో త్రిముఖ పోటీ
అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుగా ఉన్న బిలియనీర్ ఎలాన్ మస్క్, ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అభ్యర్థిపై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న యువ నేత జోహ్రాన్ మమ్దానీ (33)ని ఉద్దేశిస్తూ, "జోహ్రానే డెమోక్రాటిక్ పార్టీ భవిష్యత్తు" అని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ అనూహ్య మద్దతు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రచార ర్యాలీలో గవర్నర్ కేథీ హోచుల్, జోహ్రాన్ మమ్దానీకి మద్దతుగా ప్రసంగించారు. ఆ వీడియోకు స్పందిస్తూ మస్క్ సోమవారం ఈ వ్యాఖ్య చేశారు. ఆ ర్యాలీలో గవర్నర్ మాట్లాడుతూ.. "అమెరికాను తిరిగి మన చేతుల్లోకి తీసుకోవడానికి జోహ్రాన్‌ను గెలిపించాలి. ఈ ఎన్నికల స్ఫూర్తిని 2026 వరకు కొనసాగించి, ప్రతినిధుల సభను, సెనేట్‌ను గెలుచుకుందాం" అని పిలుపునిచ్చారు. నిన్న‌ జరిగిన ఈ సభలో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, బెర్నీ శాండర్స్ వంటి ప్రముఖ ప్రోగ్రెసివ్ నేతలు కూడా పాల్గొన్నారు.

జోహ్రాన్ మమ్దానీ తన ప్రచారంలో ప్రధానంగా సరసమైన గృహవసతి, అద్దె నియంత్రణ, అధిక ఆదాయం కలిగిన వారిపై పన్నులు వంటి అంశాలపై దృష్టి సారించారు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజల సమస్యలపై ఆయనకున్న పట్టును మెచ్చుకుంటూ గవర్నర్ హోచుల్ గత సెప్టెంబర్‌లోనే ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో ఒక వ్యాసం ద్వారా ఆయనకు మద్దతు ప్రకటించారు.

ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల బరిలో డెమోక్రాటిక్ అభ్యర్థి మమ్దానీ, రిపబ్లికన్ పార్టీ తరఫున కర్టిస్ స్లివా, స్వతంత్ర అభ్యర్థిగా ఆండ్రూ క్యూమో మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

ఇదిలా ఉండగా, ఇటీవల మమ్దానీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బ్రాంక్స్‌లోని ఒక మసీదు బయట ఆయన మాట్లాడుతూ, 9/11 దాడుల తర్వాత న్యూయార్క్‌లోని ముస్లింలు ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు. "9/11 తర్వాత మా అత్తగారు హిజాబ్ ధరించిన కారణంగా సబ్వేలో ప్రయాణించడానికి భయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నా మతాన్ని బయటపెట్టవద్దని నాకు సలహా ఇచ్చారు" అని ఆయన పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా స్పందించారు. "మమ్దానీ ప్రకారం 9/11 అసలు బాధితురాలు ఎవరో తెలుసా? ఆయన అత్తగారట" అని వాన్స్ ఎద్దేవా చేశారు. ఒకవైపు ప్రముఖుల మద్దతు, మరోవైపు తీవ్ర విమర్శలతో న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసు రసవత్తరంగా సాగుతోంది.


Zohran Mamdani
New York Mayor
Elon Musk
Kathy Hochul
Curtis Sliwa
Andrew Cuomo
New York Elections
9/11 attacks
JD Vance
US Politics

More Telugu News