Pakistan Cricket Board: సౌతాఫ్రికాతో తొలి టీ20.. గ్రీన్ కాదు పింక్ జెర్సీలో పాక్ క్రికెటర్లు

Pakistan Cricket Team to Wear Pink Jersey in T20 against South Africa
  • పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్
  • తొలి టీ20లో పింక్ జెర్సీలో బరిలోకి దిగనున్న పాక్ జట్టు
  • బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్థాన్ జట్టు తమ సంప్రదాయ గ్రీన్ జెర్సీకి బదులుగా ప్రత్యేకమైన పింక్ జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టనుంది.

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు, వారికి మద్దతుగా నిలిచేందుకు ఈ పింక్ జెర్సీ ధరించనున్నట్టు పీసీబీ వెల్లడించింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 28న జరిగే తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు పింక్ రంగు దుస్తుల్లో మెరవనున్నారు.

ఇప్పటికే ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసింది. చెరో జట్టు ఒక మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 సిరీస్‌పై పడింది. రావల్పిండిలో జరగనున్న తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం పాక్ ఆటగాళ్లు పింక్ జెర్సీలు ధరించి ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
Pakistan Cricket Board
Pakistan vs South Africa
Pakistan
South Africa
T20 series
Pink Jersey
Breast Cancer Awareness
Rawalpindi
Cricket
PCB

More Telugu News