Revanth Reddy: జూబ్లీహిల్స్ ప్రచార బరిలోకి సీఎం రేవంత్.. ఖరారైన సభలు, రోడ్‌షోల షెడ్యూల్

Revanth Reddy to Campaign in Jubilee Hills By Election
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధమైన సీఎం రేవంత్
  • రెండు విడతలుగా సాగనున్న ముఖ్యమంత్రి ప్రచారం
  • మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందన్న మహేశ్‌గౌడ్
  • ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్
  • తాము వ్యక్తిగత విమర్శలు చేయబోమని స్పష్టీకరణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఒక భారీ బహిరంగ సభ, పలు రోడ్‌షోలలో ఆయన పాల్గొంటారు.

కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 30, 31 తేదీల్లో తొలి విడత రోడ్‌షోలు ఉంటాయి. మళ్లీ నవంబర్ 4, 5 తేదీల్లో రెండో విడత రోడ్‌షోలలో సీఎం పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు. ఈ ప్రచార కార్యక్రమాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం రెండు విడతలుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌లో 70 శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని తెలిపారు. బీజేపీ కేవలం మతం పేరుతో ఓట్లు అడగడంపైనే దృష్టి పెట్టిందని, హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ పెద్దలు అందరినీ గమనిస్తున్నారని, అధిష్ఠానం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లాగా తాము ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడమని స్పష్టం చేశారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం వారి వ్యక్తిగతమని, దానితో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
Revanth Reddy
Jubilee Hills
Telangana
TPCC
Mahesh Kumar Goud
Hyderabad
By Election
Congress Party
Kishan Reddy
Welfare schemes

More Telugu News