Montha Cyclone: ఎల్లుండి ఏపీని తాకనున్న మొంథా తుపాను.. తమిళనాడు, ఒడిశాకు అలెర్ట్

Montha Cyclone to Cross AP Coast on October 28
  • బంగాళాఖాతంలో బలపడుతున్న మొంథా తుపాను
  • ఏపీ తీరం వైపు వేగంగా కదులుతున్న వాయుగుండం
  • మంగళవారం రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం
  • తీరం దాటే సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు
  • ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
  • అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇది ఈ నెల 28న మంగళవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ, రేపు ఉదయానికి తుఫానుగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి అక్టోబర్ 28 నాటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను కాకినాడ సమీపంలో, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరాన్ని తాకవచ్చని భావిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కొన్నిసార్లు గాలి వేగం 110 కిలోమీటర్లకు కూడా చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

రేపటి నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం), ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Montha
IMD
Heavy Rains
Odisha
Tamil Nadu
Puducherry
Kakinada
Machilipatnam

More Telugu News