Pawan Kalyan: కాకినాడ దిశగా 'మొంథా' తుపాను... కలెక్టర్ సూచనతో పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా!

Pawan Kalyan Postpones Kakinada Trip Due to Cyclone Montha
  • బంగాళాఖాతంలో మొంథా తుపాను
  • కాకినాడ సమీపంలో తీరం చేరే అవకాశం
  • జిల్లా కలెక్టర్ తో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ 
  • తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
  • ఏలేరు ఆయకట్టు రైతులను ముందుగానే హెచ్చరించాలని సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌తో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, కీలక సూచనలు జారీ చేశారు.

తుపాను ప్రభావం ముఖ్యంగా తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్ళరేవు మండలాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, తీరప్రాంత గ్రామాల ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. తుపాను షెల్టర్లలో ఆహారం, మంచినీరు, మందులు, పాలు వంటి నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, నీటిపారుదల, అగ్నిమాపక శాఖలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలను (NDRF) సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. 

ముఖ్యంగా ఉప్పాడ వద్ద సముద్ర కోతకు గురయ్యే ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలని స్పష్టం చేశారు.

ఏలేరు రిజర్వాయర్ నీటిమట్టంపై ఆరా తీయగా, రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉందని, గేట్లు ఎత్తే ముందు ఆయకట్టు రైతులను, ప్రజలను అప్రమత్తం చేస్తామని కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల రైతులు, ప్రజలకు ముందస్తు సమాచారం అందించేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

కాగా, తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు పవన్ కల్యాణ్ కాకినాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రస్తుతం యంత్రాంగం మొత్తం సహాయక చర్యల సన్నద్ధతలో నిమగ్నమై ఉన్నందున పర్యటనను వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సున్నితంగా కోరడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
Pawan Kalyan
Cyclone Montha
Andhra Pradesh
Kakinada
Pithapuram
Deputy CM
Weather Alert
Cyclone Relief
NDRF
Collector Shan Mohan

More Telugu News