Kavitha: నిజామాబాద్ లో నా ఓటమి వెనుక కుట్ర ఉందో లేదో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి: కవిత

Kavitha Comments on Conspiracy Behind Nizamabad Defeat
  • బీఆర్ఎస్‌కు దూరమయ్యాక కవిత కొత్త ప్రయాణం
  • నిజామాబాద్‌లో 'జాగృతి జనం బాట' కార్యక్రమం ప్రారంభం
  • కుట్ర చేసి తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపణ
  • నా దారి నేను వెతుక్కుంటున్నానంటూ భావోద్వేగ వ్యాఖ్యలు
  • అమరవీరుల కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదని వ్యాఖ్య
  • అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతానని స్పష్టీకరణ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత ప్రజల్లోకి వచ్చిన ఆమె, నేడు నిజామాబాద్ కేంద్రంగా 'జాగృతి జనం బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపారని, ఇప్పుడు తన దారి తాను వెతుక్కుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "గత 20 ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. 27 ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. ఎన్నో అవమానాలు ఎదురైనా ఓపికతో భరించాను," అని గుర్తుచేసుకున్నారు. నిజామాబాద్ లో తన ఓటమి వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించిన కవిత, "ఏం జరిగిందో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. జరిగిన కుట్ర గురించి పిల్లల్ని అడిగినా చెబుతారు" అని వ్యాఖ్యానించారు.

ఇకపై తన ప్రయాణం ప్రజలతోనే అని స్పష్టం చేసిన కవిత, తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. "తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా అమరవీరుల కుటుంబాలకు సరైన గౌరవం, న్యాయం దక్కలేదు. వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ 'జనం బాట'లో భాగంగా మేధావులు, విద్యార్థులు, రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడతాను. అందరి భాగస్వామ్యంతో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధించడమే నా లక్ష్యం" అని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లో సేవలు కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు కవిత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు. ఎంపీగా, ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన గడ్డ ఇది. అందుకే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే 'జాగృతి జనం బాట'ను ప్రారంభించడం సముచితంగా భావించాను. నాకు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలకు, యువతకు నిండు హృదయంతో ధన్యవాదాలు" అని ఆమె పేర్కొన్నారు. కవిత తాజా వ్యాఖ్యలు, కొత్త కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Nizamabad
Telangana Politics
Jagruthi Janam Bata
KCR
Telangana
MLC
Political Conspiracy

More Telugu News