Jada Shravan: కోటి కాదు.. నియోజకవర్గానికి రూ. 5 కోట్లు అడిగా: టీడీపీతో పొత్తుపై జడ శ్రావణ్ సంచలన వ్యాఖ్యలు

Jada Shravan Demanded 5 Crores Per Constituency for TDP Alliance
  • టీడీపీని నియోజకవర్గానికి రూ. 5 కోట్లు, 5 సీట్లు అడిగింది నిజమే
  • ఇది రాజకీయ ప్రక్రియలో భాగమేనని వెల్లడి
  • చంద్రబాబు అరెస్ట్, బీజేపీ-జనసేన రావడంతో మమ్మల్ని పక్కనపెట్టారు
  • 2029 నాటికి 15 లక్షల ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యం
  • వ్యతిరేక గళాలను అణచివేయడం కూటమి ప్రభుత్వానికి తగదు
  • రాజకీయంగా కుదిరితే జగన్‌తోనూ కలిసి పనిచేస్తా
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తాను నియోజకవర్గానికి కోటి రూపాయలు కాదు, ఏకంగా ఐదు కోట్ల రూపాయలతో పాటు ఐదు అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేశానని ఆయన అంగీకరించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో.. "మీరు టీడీపీని 170 నియోజకవర్గాలకు కోటి చొప్పున అడిగారట కదా?" అని ప్రశ్నించగా  "టీడీపీతో పొత్తు చర్చల సమయంలో నియోజకవర్గానికి కోటి కాదు, రూ. 5 కోట్లు, ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాను. ఇది రాజకీయ ప్రక్రియలో భాగమే. ఐదేళ్లపాటు ప్రజల కోసం పోరాడిన మేము అసెంబ్లీలో ఉండాలనుకోవడంలో తప్పేముంది?" అని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, చివరి నిమిషంలో చంద్రబాబు అరెస్ట్ కావడం, ఆ తర్వాత జనసేన, బీజేపీ కూటమిలోకి రావడంతో తమ లాంటి చిన్న పార్టీలను పక్కన పెట్టారని ఆయన వివరించారు.

భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడుతూ, 2029 నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగడమే తన లక్ష్యమని తెలిపారు. "రాబోయే నాలుగేళ్లలో కనీసం 10 నుంచి 15 లక్షల ఓటు బ్యాంకును సాధించేందుకు కృషి చేస్తాం. అప్పుడు మా డిమాండ్లకు బలం చేకూరుతుంది. ప్రభుత్వాలను ప్రభావితం చేసే శక్తి మాకు వస్తుంది. మా వర్గం ప్రజల హక్కులను కాపాడటానికి అధికారం అవసరం" అని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో జగన్ పార్టీతో కలిసి పనిచేయడానికైనా సిద్ధమేనని, అది ఆనాటి రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా గత వైసీపీ ప్రభుత్వ బాటలోనే పయనిస్తోందని జడ శ్రావణ్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై, మీడియాపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. "గత ప్రభుత్వం చేసిన తప్పులనే మీరు కూడా పునరావృతం చేస్తే ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు. కర్రు కాల్చి వాత పెట్టిన రోజున నిలువ నీడ లేకుండా పోతుంది" అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే అది ప్రభుత్వాల మనుగడకే ప్రమాదమని ఆయన సూచించారు.
Jada Shravan
Jai Bhim Bharat Party
TDP alliance
Chandrababu Naidu
YS Jaganmohan Reddy
Andhra Pradesh politics
Political alliances
2029 elections
Vote bank
AP government

More Telugu News