Mancherial: కొడుకు పుట్టలేదని ఘోరం.. 9 నెలల కూతురు సహా తల్లి ఆత్మహత్య

Mother and commits suicide with 9 month old daughter in Mancherial
  • మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం
  • కొడుకు పుట్టలేదన్న మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
  • 9 నెలల చిన్నారి సహా బావిలో దూకిన తల్లి
  • మృతురాలు జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన స్పందన
  • ఇప్పటికే దంపతులకు మూడేళ్ల కుమార్తె
మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ తల్లి తన 9 నెలల పసికందుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన జన్నారం మండలం రేండ్లగూడలో జ‌రిగింది.

వివరాల్లోకి వెళితే.. రేండ్లగూడకు చెందిన శ్రవణ్‌తో స్పందనకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె ఉంది. తొమ్మిది నెలల క్రితం స్పందన రెండోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, రెండో కాన్పులోనైనా కొడుకు పుట్టలేదనే కారణంతో ఆమె గత కొంతకాలంగా తీవ్ర మ‌నోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన స్పందన, తన 9 నెలల చిన్నారి సహా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకింది. తల్లీకూతుళ్లు బావిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
Mancherial
Telangana
Suicide
Infanticide
Daughter
Gender disappointment
Rendlaguda
Jannaram
Family tragedy

More Telugu News