Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కి బిగుసుకుంటున్న ఉచ్చు!

Jogi Ramesh embroiled in fake liquor case
  • సిట్ అధికారుల విచారణలో జోగి రమేశ్ పేరును వెల్లడించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు
  • వైసీపీ హాయంలోనూ జోగితో కలిసి నకలీ మద్యం వ్యాపారం చేసినట్లు వెల్లడి
  • ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేశ్ ను కలిశానన్న అద్దేపల్లి జనార్దనరావు 
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు (A1) పోలీసుల విచారణలో దీని వెనుక జోగి రమేశ్ ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

అద్దేపల్లి జనార్దనరావు పోలీసు విచారణలో చెప్పిన విషయాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందంటూ జోగి రమేశ్ ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలలో పేర్కొనడం, వైకాపా నేతలు కూడా ఇదే విషయంపై అధికార పార్టీపై ఆరోపణలు చేయడం తెలిసిందే. తాజాగా పోలీసుల విచారణలోనూ జోగి రమేశ్ పేరును అద్దేపల్లి జనార్దనరావు ప్రస్తావించడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని అంటున్నారు.

కోర్టు అనుమతితో ఏడు రోజుల కస్టడీలో భాగంగా జనార్దనరావు, జగన్మోహనరావులను నిన్న నెల్లూరు, విజయవాడ జైళ్ల నుంచి కస్టడీలోకి తీసుకుని తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు విచారించారు. ఈ క్రమంలో జనార్దనరావు సిట్ అధికారుల విచారణలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రలోభాలకు లొంగి నకిలీ మద్యం తయారీ ప్రారంభించానని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని చెప్పారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ స్థాపించవచ్చని ఆశపెట్టారని చెప్పుకొచ్చారు.

ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని, తద్వారా సీఎం చంద్రబాబును బద్నాం చేయొచ్చని జోగి చెప్పినట్లు విచారణలో అద్దేపల్లి వివరించారు. అంతే కాకుండా వైకాపా హయాంలో జోగి రమేశ్‌తో కలిసి అక్రమ మద్యం వ్యాపారం చేశానని, ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో ఆ వ్యాపారం నిలిపివేసినట్లు అద్దేపల్లి వెల్లడించారు.

ఆఫ్రికా వెళ్లే ముందు రోజు ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ ఇంటికెళ్లి కలిశానని, చాలా సేపు మాట్లాడుకోవడం జరిగిందని, తాను ఆఫ్రికా వెళ్లిన తర్వాత ఆయన మనుషుల ద్వారా ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాల సమాచారమిచ్చి పట్టిచ్చారని జనార్దనరావు తెలిపారు.

ఈ సమాచారంతో దర్యాప్తు అధికారులు జోగి రమేశ్‌ పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై ఆరోపణలకు బలం చేకూరడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. 
Jogi Ramesh
Andhra Pradesh
fake liquor case
Adepalli Janardhana Rao
YSRCP
Chandrababu
Nellore
Vijayawada
Mulakalacheruvu
liquor scam

More Telugu News