Osama bin Laden: లాడెన్ బురఖా ధరించి మా పక్క నుంచే వెళ్లిపోయాడు: సీఐఏ మాజీ అధికారి

Osama Bin Laden escaped in Burqa says CIA officer
  • మా బలగాలతో ఉన్న అనువాదకుడూ అల్ ఖైదా మనిషే
  • ఆఫ్ఘనిస్థాన్ లోని టోరా బోరా కొండల్లో లాడెన్ ను చుట్టుముట్టినట్లు వెల్లడి
  • సాయంత్రం వరకు తాత్సారం చేసి చీకటి మాటున లాడెన్ తప్పించుకున్నట్లు వివరణ
అమెరికాను వణికించిన అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ గురించి సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకో ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా వెల్లడించారు. 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా టెర్రరిస్టులు విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత అమెరికా బలగాలు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కోసం వేట మొదలు పెట్టాయి. అమెరికా బలగాలను ముఖ్యంగా సీఐఏను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్.. చివరకు 2011 మే 2న పాకిస్థాన్ లోని అబోట్టాబాద్ లో హతమయ్యాడు.

ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన పదేళ్ల తర్వాత లాడెన్ ను అమెరికా బలగాలు తుదముట్టించాయి. అయితే, లాడెన్ అంతకుముందే తమకు పట్టుబడేవాడని, త్రుటిలో తప్పించుకున్నాడని జాన్ కిరియాకో చెప్పారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాతి నెలలో.. అంటే అక్టోబర్ లోనే ఆఫ్ఘనిస్థాన్ లోని టోరాబోరా కొండల్లో అల్ ఖైదా స్థావరాన్ని సీఐఏ బలగాలు చుట్టుముట్టాయని వివరించారు. ఆ సమయంలో బిన్ లాడెన్ కూడా అక్కడే ఉన్నాడని చెప్పారు. లాడెన్ కదలికలపై పక్కాగా నిఘా పెట్టి టోరాబోరా కొండల్లో అతడిని పట్టుకోవడమో లేక హతమార్చడమో చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లామని వివరించారు.
 
అల్ ఖైదా కూడా తమకు కౌంటర్ గా కుయుక్తులు పన్నిందని, అందులో మొదటగా తమ సానుభూతిపరుడిని మా వద్దకు పంపించిందని జాన్ కిరియాకో చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో లాడెన్ కోసం వేటాడుతున్న క్రమంలో తమకు స్థానిక భాషలు తెలిసిన అనువాదకుడి అవసరం ఏర్పడిందన్నారు. ఇందుకోసం తాము నియమించుకున్న స్థానికుడు అల్ ఖైదా సానుభూతిపరుడేనని తర్వాత తెలిసిందన్నారు. టోరాబోరా కొండలను చుట్టుముట్టిన తర్వాత టెర్రరిస్టుల నుంచి తమకు ఓ ప్రతిపాదన వచ్చిందన్నారు.

తమ వద్దనున్న మహిళలు, పిల్లలను క్షేమంగా బయటకు పంపించాక తాము లొంగిపోతామని టెర్రరిస్టులు చెప్పారని, ఇందుకోసం సాయంత్రం దాకా వేచి ఉండాలని ప్రతిపాదించారని వివరించారు. తమకు అనువాదకుడిగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రతిపాదనకు అధికారులను ఒప్పించాడన్నారు. తీరా సాయంత్రం మసక చీకట్లలో మహిళలతో పాటు బిన్ లాడెన్ కూడా ఓ బురఖా ధరించి తమ పక్క నుంచే వెళ్లిపోయాడని జాన్ కిరియాకో వివరించారు. నాడు అల్ ఖైదా టెర్రరిస్టుల ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే లాడెన్ ను 2001లోనే తుదముట్టించే వాళ్లమని కిరియాకో తెలిపారు.
Osama bin Laden
Al-Qaeda
CIA
Twin Towers
Afghanistan
Tora Bora
John Kiriakou
Pakistan
Abbottabad
Terrorism

More Telugu News