India vs Australia: మూడో వన్డేలో టాస్ నెగ్గిన ఆసీస్.. భారత జట్టులో రెండు మార్పులు

Mitchell Marsh wins toss Australia opts to bat
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ మిచెల్ మార్ష్
  • రెండు కీలక మార్పులతో బ‌రిలోకి భార‌త్‌
  • నితీశ్‌ రెడ్డి, అర్ష్‌దీప్‌ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి
  • ఆస్ట్రేలియా జట్టులో బార్ట్‌లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్
  • ఇప్ప‌టికే 2-0తో సిరీస్ కైవ‌సం చేసుకున్న ఆతిథ్య ఆసీస్‌
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, మంచి స్కోరు సాధించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్ష్ తెలిపాడు. ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు చేసింది. జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే, టీమిండియా కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. నితీశ్ కుమార్‌ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌ స్థానాల్లో కుల్దీప్ యాద‌వ్‌, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వ‌చ్చారు. 

టాస్ అనంతరం మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. "పిచ్ చూడటానికి చాలా బాగుంది. ఎండగా ఉండటంతో పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. మేము బాగా బ్యాటింగ్ చేసి బోర్డుపై మంచి స్కోరు ఉంచాలని ఆశిస్తున్నాం. జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. జేవియర్ స్థానంలో నాథన్ ఎల్లిస్ ఆడుతున్నాడు" అని తెలిపాడు.

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని, కాబట్టి తమకు కావాల్సిందే జరిగిందని చెప్పాడు. "నిజం చెప్పాలంటే మేము మొదట బౌలింగ్ చేయడానికే ఇష్టపడ్డాం. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఛేదించడం మా ప్రణాళిక. గత మ్యాచ్‌లో మేము తగినన్ని పరుగులు చేసినా, కొన్ని అవకాశాలు చేజార్చుకున్నాం" అని అన్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు గిల్ వెల్లడించాడు. అర్ష్‌దీప్ సింగ్, కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చార‌ని పేర్కొన్నాడు. ఇక‌, మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇప్ప‌టికే మొద‌టి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆతిథ్య జ‌ట్టు టైటిల్ కైవ‌సం చేసుకుంది. మూడో వ‌న్డేలో కూడా విజ‌యం సాధించి వైట్‌వాష్ చేయాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా చూడాల‌ని యోచిస్తోంది. 

తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ రెన్‌షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
India vs Australia
Mitchell Marsh
Australia tour of India 2024
Shubman Gill
Kuldeep Yadav
Prasidh Krishna
Nathan Ellis
Cricket
ODI Series
Cricket Match

More Telugu News