Chandrababu: ఫలించిన సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన.. ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు

Chandrababu UAE Tour Attracts Investment Commitments for Andhra Pradesh
  • ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల సానుకూలత
  • అమరావతిలో లైబ్రరీకి శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం
  • వచ్చే నెల విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతామన్న పారిశ్రామికవేత్తలు
  • రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఏఐ, వైద్య రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి
  • ఏపీకి తమ బృందాన్ని పంపుతామన్న యూఏఈ మంత్రులు
  • ప్రవాసాంధ్రుల కోసం భీమా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంస్థలు తీవ్ర ఆసక్తి కనబరిచాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం మూడు రోజుల యూఏఈ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించడంలో సీఎం సఫలీకృతులయ్యారు. త్వరలోనే కచ్చితమైన ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు హామీ ఇచ్చారు.

వివిధ రంగాలపై యూఏఈ కంపెనీల ఆసక్తి
చంద్రబాబుతో భేటీ అయిన పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కల్పనలో తమకు ఆసక్తి ఉందని శోభా గ్రూప్ తెలిపింది. ఈ సందర్భంగా అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ఆ సంస్థ చైర్మన్ రవి మీనన్ రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో పాలుపంచుకుంటామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ తెలపగా, ఏపీలో లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని షరాఫ్ గ్రూప్ హామీ ఇచ్చింది. వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు బుర్జిల్ హెల్త్ కేర్, ఏఐ డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీపై జీ42 సంస్థ ఆసక్తి చూపాయి.

ప్రాంతాల వారీగా అవకాశాలను వివరించిన సీఎం
తన మూడు రోజుల పర్యటనలో సుమారు 25 కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతం ప్రత్యేకతను, అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి విడమరిచి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని వివరించారు. రాయలసీమలో పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు అవకాశాలున్నాయని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, టూరిజం రంగాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని, అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, అవసరమైతే విధానాల్లో మార్పులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ, ప్రవాస భారతీయులతో సమావేశాలు
పర్యటనలో భాగంగా యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్, ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్‌లతో సీఎం బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ బృందాన్ని పంపిస్తామని యూఏఈ మంత్రులు హామీ ఇచ్చారు. దుబాయ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పది గల్ఫ్ దేశాల నుంచి వేలాదిగా తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ, కియా మోటార్స్ కోసం చంద్రబాబు పడిన తపనను తాను ప్రత్యక్షంగా చూశానని, రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు.

వచ్చే నెలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఆసక్తి చూపిన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రవాసాంధ్రులకు భీమా పథకం
"ప్రవాసాంధ్రుల కోసం భీమా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రూ.10 లక్షల వరకూ అందరికీ భీమా కల్పించేలా కార్యక్రమం చేపట్టాం. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులు 18-60 ఏళ్ల వరకూ వయస్సు ఉన్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులకు ఈ భీమా వర్తింపచేస్తున్నాం. ప్రవాసాంధ్రులు ఎదుర్కోనే న్యాయపరమైన ఇబ్బందులకు ఎన్నార్టీ సొసైటీ ద్వారా లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజుల లాంటి సమస్యల పరిష్కారం చేస్తాం. అలాగే  ప్రసూతీ ఖర్చుల కింద రూ.35 వేలు, సిజేరియన్ ద్వారా రూ.50 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తాం. ఏపీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అని ఏపీలో పిలుపునిచ్చాం. ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో ఒకరు పరిశ్రమ పెట్టండి. దీనికోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. దుబాయ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చి ఏ నాయకుడికీ దక్కని గౌరవాన్ని అందించిన ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం తెలుగు డయాస్పోరాకు హాజరైన వారు ఫొటోలు దిగేందుకు సీఎం సమయం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ సౌసైటీ చైర్మన్ వేమూరి రవి, దుబాయ్‌లో భారత కాన్సులేట్ జనరల్ సతీశ్‌ శివన్ తదితరులు హాజరయ్యారు.

Chandrababu
Andhra Pradesh investments
UAE companies
AP industrial development
Visakhapatnam
Amaravati
Partnership Summit
NRI insurance scheme
AP economy
Foreign investments

More Telugu News